పరువు హ‌త్య‌ల‌కు ఫుల్‌స్టాప్ ప‌డేదెప్పుడు?

ప‌రువు పేరిట హేమంత్‌ను దారుణంగా హ‌త్య చేయించ‌డం చాలా బాధ‌ను క‌లిగిస్తోంది. ప్రేమించుకొని, పెళ్లి చేసుకోవ‌డం త‌ప్ప‌నే త‌ప్పుడు అభిప్రాయాన్ని ఇంకా మ‌నం వ‌దిలించుకోలేక‌పోతున్నామా అనే ఆవేద‌న క‌లుగుతుంది. ఏ పెద్ద‌లైనా, త‌ల్లిదండ్రులైనా పిల్ల‌ల బాగు కోర‌తారంటారు. అలాంటివారు త‌మ పిల్ల‌లు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం స‌హించ‌లేక‌పోతున్నారు. కూతురో, కొడుకో వేరే కులానికి చెందిన చెందిన‌వాళ్ల‌ను ప్రేమించి పెళ్లిచేసుకుంటే త‌మ ప‌రువు ప్ర‌తిష్ఠ‌ల‌కు భంగం క‌లిగింద‌ని భావించి, వాళ్ల‌ను కిరాత‌కంగా చంపిస్తుండ‌టం చూస్తుంటే మ‌నం ఇంకా ఏ స‌మాజంలో బ‌తుకుతున్నామా అనే బాధ క‌లుగుతోంది. 

 

ఇంత‌కు ముందు అమృత తండ్రి త‌న అల్లుడ్ని దారుణంగా న‌రికి చంపిస్తే, ఇప్పుడు అవంతి తండ్రి త‌న అల్లుడు హేమంత్‌ను కిడ్నాప్ చేయించి హ‌త్య చేయించ‌డం దారుణ మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పాలి. ఇలాంటి ఘోర‌మైన ప‌నులు చేస్తే, త‌మ పిల్ల‌లు ఎలా సంతోషంగా ఉండ‌గ‌లుగుతారు? పిల్ల‌ల సంతోషం కంటే కులం, మ‌తం ప్ర‌ధాన‌మైన‌వా? ఇవాళ కుల‌మ‌తాల హ‌ద్దుల‌ను చెరిపేసి, అన్ని కులాలు, మ‌తాలు ఒక‌టే అనే అభిప్రాయాన్ని చాటుతూ ఎంతోమంది ప్రేమ వివాహాలు చేసుకొని హాయిగా జీవిస్తుంటే, కొంత‌మంది మాత్రం త‌మ‌కు కుల‌మే ముఖ్యం, ప‌రువే ముఖ్యం అని భావించుకుంటూ, ప‌రువు హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుండ‌టం బాధాక‌రం. 

 

అలాంటి సంకుచిత ధోర‌ణుల‌ను మ‌నం మార్చుకోవాలి. హేమంత్‌ను దారుణంగా హ‌త్య చేయ‌డం వ‌ల్ల ఎవ‌రు సంతోషంగా ఉంటారు? అత‌డిని మ‌న‌సారా ప్రేమించి పెళ్లి చేసుకున్న అవంతి ప‌రిస్థితి ఏమిటి? ఆమె బాధ‌ను ఎవ‌రు తీరుస్తారు? క‌న్న తండ్రే కూతురి జీవితం నుంచి సంతోషాన్ని లాగేసుకోవ‌డం ఏ ర‌కంగా క‌రెక్ట్‌? ఆమెకు జ‌రిగిన క‌ష్టం కానీ, హేమంత్ త‌ల్లిదండ్రుల‌కు క‌లిగిన క‌ష్టం కానీ ఎలా తీరుతుంది?  

 

ప‌రువు పేరిట అన్యాయంగా కొడుకు బ‌లైపోతే ఆ త‌ల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్లు జ‌ల‌ద‌రిస్తోంది. ద‌య‌చేసి, అంద‌రూ ఆలోచించండి. ఒక అమ్మాయి, అబ్బాయి ఒక‌ర్నొక‌రు ఇష్ట‌ప‌డి, ప్రేమించి పెళ్లిచేసుకోవ‌డం త‌ప్పు కాదు. ప్రేమ‌లో కుల మ‌తాల‌కు తావు లేదు. వాళ్ల ఆనందాన్ని ప‌రువు పేరిట‌, కుల‌మ‌తాల పేరిట చెరిపేయ‌కండి. పిల్ల‌ల అభిప్రాయాల‌కు, వాళ్ల ప్రేమ‌ల‌కు విలువ‌నివ్వండి. ఇలాంటి పరువు హ‌త్య‌లు ఇంకెప్పుడూ జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకుందాం.