తక్కువ ఆహారం తింటున్నా బరువు తగ్గడం లేదని ఆందోళన పడుతున్నారా.!
Published on: Sat Oct 10, 2026 11:01AM
.webp)
బరువు తగ్గడానికి ఆహారం తగ్గించడం, నియమబద్ధంగా వ్యాయామం చేయడం వంటి మార్గాలు అందరికీ తెలిసిందే. అయితే, చాలామంది డైటింగ్ సరిగ్గా చేస్తున్నా, క్యాలరీలు తక్కువగా తీసుకుంటున్నా బరువు కాస్త కూడా తగ్గడం లేదని ఆవేదన చెందుతుంటారు. అంతగా కష్టపడుతున్నా ఫలితం కనిపించకపోవడానికి మనం పెద్దగా పట్టించుకోని ఒక రహస్య కారణం ఉంది. అదే నిద్ర, ఇన్సులిన్, బరువు పెరగడం మధ్య ఉన్న అంతర్గత సంబంధం. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
సరిగా నిద్రపోకపోతే..
రాత్రిపూట తగినంత నిద్రపోకపోవడం మన శరీర జీవక్రియలను పూర్తిగా తలకిందులు చేస్తుంది. మన నిద్రకూ, శరీరంలో ఉండే ఇన్సులిన్ హార్మోన్‌కూ నేరుగా సంబంధం ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం తనను తాను రీఛార్జ్ చేసుకుంటుంది. కానీ సరిపడా నిద్ర లేకపోతే శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసోల్ అనే హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ కార్టిసోల్ ప్రభావం వల్ల ఇన్సులిన్ హార్మోన్ పనితీరు దెబ్బతింటుంది.
ఇన్సులిన్ నిరోధకత..
ఇన్సులిన్ ప్రధాన పని రక్తంలో ఉన్న గ్లూకోజ్ ను కణాలకు శక్తిగా అందించడం. కానీ నిద్రలేమి వల్ల కణాలు ఇన్సులిన్ కు సరిగ్గా స్పందించవు. దీనినే ఇన్సులిన్ నిరోధకత అంటారు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి, ఆ అదనపు చక్కెర అంతా కొవ్వు రూపంలో శరీరంలో, ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోతుంది. ఎంత తక్కువ తిన్నా, ఇన్సులిన్ నిరోధకత వల్ల శరీరం కొవ్వును కరిగించడానికి బదులు మరింత కొవ్వును దాచిపెట్టడానికే ప్రాధాన్యం ఇస్తుంది.
ఆకలి హార్మోన్లు..
మరొక వైపు, సరైన నిద్ర లేనప్పుడు ఆకలిని నియంత్రించే హార్మోన్లలో కూడా మార్పులు వస్తాయి. ఆకలిని పెంచే గ్రెలిన్ అనే హార్మోన్ పెరిగిపోతుంది, కడుపు నిండిన భావనను ఇచ్చే లెప్టిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల మనకు తెలియకుండానే తియ్యటి లేదా ఎక్కువ క్యాలరీలు ఉన్న పదార్థాలు తినాలనిపిస్తుంది.
మెటబాలిజం..
నిద్రలేమితో బాధపడేవారిలో జీవక్రియ వేగం లేదా మెటబాలిజం మందగిస్తుంది. శరీరం కేలరీలను కరిగించే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా రోజంతా తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ, శరీరం దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక బరువు పెరిగేలా చేస్తుంది.
అందుకే బరువు తగ్గాలనుకునేవారు కేవలం ఆహార నియమాలు, వ్యాయామాలపైనే కాకుండా రాత్రిపూట కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నాణ్యమైన నిద్రపోవడంపై శ్రద్ధ పెట్టాలి. సరైన సమయానికి పడుకోవడం, పడుకునే ముందు ఫోన్లు లేదా స్క్రీన్లకు దూరంగా ఉండటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి మార్పులు చేసుకోవాలి. నిద్ర సమయాన్ని సరిచేసుకుంటే ఇన్సులిన్ సమతుల్యత పునరుద్ధరించబడి, పడుతున్న కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది.
*రూపశ్రీ.


