TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎలాంటి వ్యక్తులను వదిలేయాలి ఎలాంటి వారిని వదిలేసినప్పుడు మన విలువ అర్థం చేసుకుంటారు.!

Published on: Sat Sep 19, 2026 8:54AM

ఎలాంటి వ్యక్తులను వదిలేయాలి ఎలాంటి వారిని వదిలేసినప్పుడు మన విలువ అర్థం చేసుకుంటారు.!

జీవిత ప్రయాణంలో మన ప్రశాంతతను, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కొందరు వ్యక్తులను దూరం పెట్టడం చాలా అవసరం. ప్రతి సంబంధమూ మన ఎదుగుదలకు ఉపయోగపడదు, కొన్ని బంధాలు మన శక్తిని, సంతోషాన్ని హరించివేస్తాయి. మన ఉనికికి గుర్తింపు లేని చోట, మన ప్రేమకు గౌరవం దక్కని చోట సున్నితంగా తప్పుకోవడమే తెలివైన పని. అయితే చాలా మంది ఎంతో నష్టపోయినా సరే.. ఎవరికి దూరం ఉండాలో, ఎవరిని దూరం పెట్టాలో తెలియకుండా బ్రతికేస్తుంటారు. దీని వల్ల జీవితాంతం ప్రశాంతత లేకుండా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. అందుకే జీవితంలో ఎవరిని దూరం పెట్టాలి? ఎవరికి దూరంగా ఉండాలి? ఏం చేస్తే మన విలువ వారికి అర్థమవుతుంది? వివరంగా తెలుసుకుంటే..

ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి?

ఎల్లప్పుడూ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడేవారు లేదా మీ విజయాలను చూసి అసూయపడే వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు పైకి స్నేహితులుగా నటించినా, మనసులో మీ పతనాన్ని కోరుకుంటారు.
సహాయం కావాల్సినప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తుతెచ్చుకుని,  అవసరం తీరిపోయాక ముఖం చాటేసే స్వార్థపరులను వదిలేయాలి.

ప్రతి చిన్న విషయానికి  మానసికంగా కుంగదీసేవారు, మీ తప్పులే వెతికేవారు, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తులు జీవితంలో ఉండటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీ నమ్మకాన్ని పదే పదే ఒమ్ము చేసేవారికి ఎంత త్వరగా దూరమైతే అంత మంచిది.

ఎలాంటి వారిని వదిలేస్తే  మన విలువను అర్థం చేసుకుంటారు ?

మనం పదే పదే అందుబాటులో ఉండటం వల్ల మన ప్రాధాన్యతను తేలికగా తీసుకునేవారు ఉంటారు.  ఎల్లప్పుడూ వారికోసమే ఉంటామనే ధీమా ఉన్నప్పుడు, మన మాటలకు లేదా మన సమయానికి వారు విలువ ఇవ్వరు. అలాంటి వారికి దూరమైనప్పుడు మాత్రమే, మన విలువ  ఏంటో వారికి స్పష్టంగా అర్థమవుతుంది.

మీరు అందించిన ప్రేమానురాగాలను లైట్ జాతీసుకునే వ్యక్తులు..  మీరు లేని జీవితాన్ని, శూన్యాన్ని అనుభవించినప్పుడే మీ ప్రేమ ఎంత గొప్పదో గుర్తించగలుగుతారు. మీరు పడే బాధను పట్టించుకోకుండా, మీ ఉనికిని నిర్లక్ష్యం చేసినవారిని దూరం పెట్టినప్పుడే.. తమ తప్పు తెలుసుకునే అవకాశం ఉంటుంది.

బంధాలలో ఒకవైపే ప్రేమ ఉండటం, బాధ్యత ఉండటం, సర్దుకుపోవడం, బంధం కోసం పాటుపడటం  దండగ. మనం దూరమైనప్పుడు వచ్చే ఖాళీతనం, ఎదుటివారికి మన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మన గౌరవాన్ని కాపాడుకుంటూ దూరంగా జరగడమే మన విలువను తెలియజెప్పే మంచి మార్గం.

                    *రూపశ్రీ.