TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు.!

Published on: Tue Sep 29, 2026 4:40PM

పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు.!


పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక నిరంతర ప్రయాణం. పిల్లలు తల్లిదండ్రులు  చెప్పే మాటల కంటే వాళ్లు  చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు, అనుకరిస్తారు. ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లల భవిష్యత్తుకు, వారి వ్యక్తిత్వానికి పునాది అవుతుంది. ఇంట్లో ఆత్మీయత, అనురాగం ఉన్నప్పుడే పిల్లలు శారీరకంగా, మానసికంగా బలంగా ఎదుగుతారు. అందుకే వారి ముందు తల్లిదండ్రులు  ఎలా ప్రవర్తిస్తున్నారనేది చాలా ముఖ్యం. పిల్లల ఎదుట తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుంటే..

పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలా ఉండాలి

ఆప్యాయత, గౌరవంతో మాట్లాడాలి..

ఇంట్లో తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమగా మాట్లాడుకోవడం చూసినప్పుడు పిల్లల్లో నేర్చుకునే తత్వం, నమ్మకం పెరుగుతాయి. వారు కూడా ఇతరులతో అలాగే మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకుంటారు.

చెప్పేది వినే ఓపిక ఉండాలి..

పిల్లలు స్కూల్ నుండి రాగానే లేదా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వారి మాటలను శ్రద్ధగా వినాలి. తల్లిదండ్రులకు ఎంత పని ఉన్నా, వారి మాటలకు విలువ ఇస్తే తమ సమస్యలను తల్లిదండ్రుల దగ్గర  దాచకుండా పంచుకుంటారు.

 జీవనం..

తల్లిదండ్రులు  పిల్లలకు ఎలాంటి మంచి అలవాట్లు ఉండాలని కోరుకుంటారో, మొదట తల్లిదండ్రులు కూడా  వాటిని పాటించి చూపాలి. సమయపాలన, నిజాయితీ, తోటివారికి సహాయం చేయడం వంటి గుణాలను తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు.

ప్రోత్సాహం అందించాలి..

పిల్లలు ఏ చిన్న మంచి పని చేసినా లేదా ఆటల్లో, చదువులో ప్రయత్నించినా మెచ్చుకోవాలి. ఓడిపోయినప్పుడు నిరాశపడకుండా, మళ్లీ ప్రయత్నించేలా ధైర్యం చెప్పాలి.

శాంతంగా, సహనంతో ఉండాలి..

పరిస్థితులు ఎలా ఉన్నా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులు  కోపంగా కాకుండా సహనంతో నిర్ణయాలు తీసుకోవడం చూస్తే, పిల్లలు కూడా ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేర్చుకుంటారు.

పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలా ఉండకూడదు..

గొడవలు పడకూడదు..

తల్లిదండ్రులు పిల్లల ఎదుట అరుచుకోవడం, పెద్దగా గొడవపడటం అసలు చేయకూడదు. ఇది వారిని తీవ్ర భయానికి, ఆందోళనకు గురిచేస్తుంది. వారి మనస్సులో అభద్రతా భావం ఏర్పడుతుంది.

ఇతరులతో పోల్చకూడదు..

పక్కింటి పిల్లలతోనో లేదా తోబుట్టువులతోనో పోల్చి మాట్లాడకూడదు. నువ్వు దేనికి పనికిరావు అని తక్కువ చేసి మాట్లాడితే వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.

ఎప్పుడూ ఫోన్లకే పరిమితం కాకూడదు..

పిల్లల ముందు తల్లిదండ్రులు గంటల తరబడి మొబైల్ ఫోన్లు వాడటం, టీవీలు చూడటం తగ్గించాలి. తల్లిదండ్రులే  ఫోన్ పట్టుకుని కూర్చుంటే, పిల్లలకు దూరంగా ఉండమని చెప్పే హక్కు తల్లిదండ్రులు  కోల్పోతారు.

అబద్ధాలు చెప్పడం లేదా ఇతరులను దూషించడం..

తల్లిదండ్రులు తమకు  తెలియకుండానే పిల్లల ముందు చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం చేయకూడదు. అది చూసి పిల్లలు కూడా అబద్ధాలు చెప్పడం సహజమేనని అనుకుంటారు.

అతిగా కోప్పడటం లేదా కొట్టడం..

చిన్న చిన్న పొరపాట్లకు పిల్లలపై విరుచుకుపడటం, కొట్టడం చేయకూడదు. అలా చేస్తే వారిలో మొండితనం పెరుగుతుంది తప్ప మార్పు రాదు.

పిల్లలకు తల్లిదండ్రులు  ఇచ్చే అతిపెద్ద బహుమతి డబ్బు,  ఆస్తులు కాదు, ఒక మంచి, సురక్షితమైన వాతావరణం. ప్రేమ, సహనం, ఆప్యాయతలతో కూడిన పెంపకమే వారిని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది.

                                                                                                                                               *రూపశ్రీ.