TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లైఫ్ లో సక్సెస్ కావాలంటే  మనిషి ఆలోచన ఎలా ఉండాలి.!

Published on: Tue Sep 15, 2026 6:40PM

లైఫ్ లో సక్సెస్ కావాలంటే  మనిషి ఆలోచన ఎలా ఉండాలి.!

జీవితంలో విజయం సాధించడం అనేది అనుకోకుండా జరిగే ఒక సంఘటన కాదు. అది ఒక నిరంతర ప్రయాణం. ఈ ప్రయాణంలో మన గమ్యాన్ని, మన స్థాయిని నిర్ణయించేది మన ఆలోచనా సరళి మాత్రమే. ఒక మనిషి ఎలా ఆలోచిస్తే అతని జీవితం అలానే తయారవుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనం స్పందించే తీరు, మన మానసిక స్థితి , మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తును రూపుదిద్దుతాయి. విజేతలకు, సాధారణ వ్యక్తులకు మధ్య ఉండే ప్రధాన తేడా వారి ప్రతిభ లేదా అదృష్టం మాత్రమే కాదు, వారి ఆలోచనా విధానం కూడా. విజయం సాధించడానికి  మనిషి ఆలోచనా సరళి ఎలా ఉండాలో వివరంగా తెలుసుకుంటే..

 చాలామంది తమ సామర్థ్యాలకు ఒక హద్దును ఏర్పరచుకుంటారు. కానీ, సరైన శిక్షణ, శ్రమ , నిరంతరం  నేర్చుకుంటూ ఉండటం వంటి వాటి ద్వారా ఏ నైపుణ్యాన్నైనా పెంపొందించుకోవచ్చనే నమ్మకం ఉండాలి. ఓటమి అనేది ప్రయాణానికి ముగింపు కాదని, అది ఒక అనుభవమని గ్రహించాలి. ప్రతి వైఫల్యం ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగే ఆలోచన ఉన్నప్పుడే వ్యక్తిగత వికాసం సాధ్యమవుతుంది.

స్పష్టమైన లక్ష్యాలు..

మనిషి ఆలోచన ఎప్పుడూ స్పష్టమైన లక్ష్యాల వైపు మొగ్గు చూపాలి. స్పష్టత లేని ఆలోచనలు గమ్యం లేని ప్రయాణం లాంటివి.  జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారు, దాని కోసం ఏ రోజు ఏమి చేయాలి అనే విషయంలో స్పష్టత ఉండాలి. లక్ష్యాలను షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని విభజించుకుని, వాటిని సాధించడానికి  ప్రణాళికలు రచించుకోవాలి. కేవలం ఆలోచించడమే కాకుండా, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టే క్రమశిక్షణ ఉండాలి.

పారిపోవడం కాదు పరిష్కారం వెతకాలి..

పరిస్థితులు ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. కష్టాలు, సవాళ్లు ఎదురైనప్పుడు నిరాశపడకుండా ధైర్యంగా నిలబడే ఆలోచనా ధోరణి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు "ఇది నాకే ఎందుకు జరిగింది" అని బాధపడటం కంటే, "ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించగలను" అని ఆలోచించడం ముఖ్యం. సమస్యల వైపు కాకుండా పరిష్కారాల వైపు దృష్టి సారించే ఆలోచనా సరళి మనిషిని మానసికంగా బలంగా మారుస్తుంది.

పరిస్థితుల సర్దుబాటు..

విజయం  సాధించాలంటే మారిన పరిస్థితులకు అనుగుణంగా మనిషి కూడా మారడం చాలా అవసరం. ప్రపంచం వేగంగా మారుతోంది. పాత ఆలోచనలకే పరిమితమైపోతే పురోగతి సాధ్యం కాదు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త సాంకేతికతలను అవగాహన చేసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండటం  అనేది మనిషి ఆలోచనను పదునుపెడుతుంది. ఏ వయసులోనైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి వెనుకాడకూడదు.

పాజిటివ్ ఆలోచన..

ఆలోచనల్లో పాజిటివ్నెస్ ఉండటం చాలా ముఖ్యం. మన ఆలోచనలే మన భావోద్వేగాలను, మన చర్యలను శాసిస్తాయి. ప్రతికూల ఆలోచనలు మన శక్తిని క్షీణింపజేస్తాయి , భయాన్ని పెంచుతాయి. పాజిటివ్ ఆలోచనలు మనలో నమ్మకాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు, మీరు సహవాసం చేసే వ్యక్తులు కూడా మీ ఆలోచనలపై ప్రభావం చూపుతారు. కాబట్టి సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో సమయం గడపడం, ప్రేరణనిచ్చే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.

సమయం విలువ..

గొప్ప విజయాలు సాధించిన వారెవరూ సమయాన్ని వృథా చేయరు. కాలం అత్యంత విలువైనది. నేటి పనిని నేడే పూర్తి చేయాలనే ఆలోచన ఉండాలి. వాయిదా వేసే అలవాటు విజయానికి అతిపెద్ద శత్రువు. ప్రతి నిమిషాన్ని ఉపయోగకరంగా మార్చుకునే ఆలోచన ఉన్నప్పుడే అనుకున్న గమ్యాన్ని త్వరగా చేరుకోగలము.

అవరోధాలు అధిగమించడం..

విజయం సాధించే క్రమంలో అనేక అడ్డంకులు వస్తాయి. మొదట్లోనే ఫలితాలు రాకపోవచ్చు. అంత మాత్రాన ప్రయత్నాన్ని ఆపకూడదు. పట్టుదల, సహనం అనేవి ఆలోచనా విధానంలో భాగం కావాలి. ఫలితం ఆలస్యమైనా, సరైన మార్గంలో పయనిస్తున్నామనే నమ్మకంతో నిలకడగా శ్రమించాలి.

చివరగా..

విజయం అనేది కేవలం డబ్బు లేదా హోదాకు మాత్రమే పరిమితం కాదు. సమాజానికి ఉపయోగపడేలా, ఇతరులకు ప్రేరణగా నిలిచేలా ఆలోచించడం నిజమైన విజయం. మన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే, మన జీవితం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి మీ ఆలోచనలను సానుకూలంగా, స్పష్టంగా, , లక్ష్య సాధన వైపు నడిపించేలా మలుచుకోవాలి. అలా చేస్తే జీవితంలో విజయం తప్పక సొంతమవుతుంది.


                      *రూపశ్రీ.