TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోజూ వాము తింటే ఏం జరుగుతుంది.. ఈ ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Published on: Sun Oct 11, 2026 3:43PM

సాధారణంగా మన భారతీయ ఇళ్లలో వాము పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది వేడివేడి బజ్జీలే. బజ్జీలకు మంచి రుచితో పాటు అరుగుదలను అందించడానికి వామును వాడుతుంటాం. లేదా కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలు వచ్చినప్పుడు కాస్త వాము, ఉప్పు కలిపి నమలడం  అలవాటు. ఇలా కేవలం రుచి కోసమో లేదా ఎప్పుడో కడుపు అసౌకర్యంగా ఉన్నప్పుడో వాడే వామును  దైనందిన ఆహారంలో క్రమం తప్పకుండా భాగం చేసుకుంటే ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చాలామందికి తెలియదు. ఆయుర్వేదంలో వాముకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.  వంటింట్లో ఎప్పుడూ నిల్వ ఉండే ఈ  చిన్న గింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ తగిన మోతాదులో వామును ఆహారంలో తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి  వివరంగా తెలుసుకుంటే..

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది..

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వేపిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జీర్ణక్రియ సరిగా లేకపోవడం. ప్రతిరోజూ వామును తీసుకోవడం వల్ల జీర్ణరసాలు బాగా ఊరుతాయి. ఇది తిన్న ఆహారం త్వరగా అరగడానికి సహాయపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపున కాస్త వాము నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడి, రోజంతా తేలికగా అనిపిస్తుంది.

బరువును తగ్గించడం..

అధిక బరువుతో బాధపడేవారికి వాము ఒక మంచి సహజసిద్ధమైన పరిష్కారం. ఇది శరీరంలోని జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. రోజువారీ ఆహారంలో వామును చేర్చుకోవడం వల్ల లేదా వాము మరిగించిన నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వును తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను, విషపదార్థాలను బయటకు పంపడానికి కూడా ఇది ఉపకరిస్తుంది.

జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలకు చెక్..

వాతావరణం మారినప్పుడు లేదా చలికాలంలో చాలామందికి పదేపదే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. వాములోని సహజ గుణాలు ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తాయి. వామును వేడి నీళ్లలో వేసి ఆవిరి పట్టడం వల్ల ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజువారీ ఆహారంలో వామును భాగం చేసుకోవడం వల్ల ఊపిరితిత్తులలో కఫం చేరుకోకుండా ఉంటుంది. ఆస్తమా లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారికి కూడా వాము మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

అధిక రక్తపోటు..

వాము గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు రక్తనాళాలకు  విశ్రాంతి ఇస్తాయి. దీనివల్ల రక్తప్రసరణ సరిగ్గా జరిగి అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. క్రమం తప్పకుండా వామును తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

కీళ్ల నొప్పులు, మంటల నుంచి ఉపశమనం..

వయసు పెరిగే కొద్దీ లేదా శరీరంలో వాపుల వల్ల వచ్చే కీళ్ల నొప్పులతో బాధపడేవారికి వాము చాలా మేలు చేస్తుంది. వాములోని వాపు నిరోధక గుణాలు నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. వామును ఆహారంలో తీసుకోవడంతో పాటు, వాము నూనెను నొప్పులు ఉన్న చోట రుద్దడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది.

మహిళల ఆరోగ్యానికి ఎంతో మేలు..

మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన కడుపునొప్పి, నడుము నొప్పి సమస్యలను తగ్గించడంలో వాము అద్భుతంగా పనిచేస్తుంది. రోజువారీ ఆహారంలో వామును చేర్చుకోవడం వల్ల లేదా ఆ సమయంలో వాము నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ క్రమబద్ధీకరించబడి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే బాలింతలకు పాల ఉత్పత్తి పెరగడానికి కూడా పూర్వం నుంచి వామును వాడటం అలవాటులో ఉంది.

ఆహారంలో వామును ఎలా భాగం చేసుకోవాలి?

వామును ప్రతిరోజూ తీసుకోవడం చాలా సులభం. ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ వాము వేసి బాగా మరిగించి, ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా తాగవచ్చు. లేదా మనం రోజువారీగా చేసుకునే రసం, తాలింపులు, పరోటాలు, కూరలలో కొద్దిగా వామును చేర్చుకోవచ్చు. టీ చేసుకునే అలవాటు ఉన్నవారు తమ రెగ్యులర్ టీలో కాస్త వాము వేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న వామును  కేవలం బజ్జీలు లేదా పిండి వంటలకే పరిమితం చేయకుండా ప్రతిరోజూ మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం. అయితే ఏదైనా మితిమీరితే నష్టం కాబట్టి, రోజూ పరిమిత మోతాదులో తీసుకోవాలి.

                                                                                                                                            *రూపశ్రీ