TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

 ప్రతిరోజూ ఒక చిన్న అల్లం ముక్కను 60 రోజుల పాటు నమిలి తింటే ఏమవుతుంది.!

Published on: Fri Sep 4, 2026 2:20PM

 


అల్లం అనేది మన ప్రాచీన వంటకాల్లోనూ, ఆయుర్వేదంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సహజమైన ఔషధం. అజీర్ణం గా ఉన్నప్పుడు, వాంతులు అవుతున్నప్పుడు, దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇక వంటింట్లో కూరల్లోనూ, మసాలా తయారీలోనూ అల్లాన్ని వాడుతుంటారు. ఇలా కాకుండా  ప్రతిరోజూ ఒక చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం అలవాటు చేసుకుంటే  ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయంపై ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో తెలుసుకుంటే.. 

అల్లం ప్రభావం.. 

వరసగా రెండు నెలలు, అంటే అరవై రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా ఒక చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల మన శరీరంలో శ్వాసకోశ వ్యవస్థ నుండి జీర్ణవ్యవస్థ వరకు అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి.

శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం , ఉపశమనం..

రోజు ఒక చిన్న అల్లం ముక్క నమలడం వల్ల గొంతులో ఏర్పడే అసౌకర్యం, మంట క్రమంగా తగ్గుతాయి. ఊపిరితిత్తులకు వెళ్లే గాలి మార్గాలను ఇది సడలించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. సుమారు ఆరు నుండి ఎనిమిది వారాల పాటు ఈ అలవాటును కొనసాగించడం వల్ల దగ్గు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది.  గాలిలో దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల గొంతు , శ్వాసనాళాల్లో కలిగే మంటను అల్లం తగ్గిస్తుంది. అల్లంలోని సహజ సిద్ధమైన వేడి చేసే గుణం ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని లేదా శ్లేష్మాన్ని పలచబడేలా చేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల నుండి కఫం సులువుగా బయటకు వచ్చేస్తుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, రొంప, , చిన్న శ్వాస సమస్యల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఆస్తమా లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు అల్లాన్ని  కేవలం  ఒక సహాయక పదార్థంగా మాత్రమే ఉపయోగించాలి తప్ప, వైద్యులు సూచించిన మందులకు ప్రత్యామ్నాయంగా తీసుకోకూడదు.

జీర్ణవ్యవస్థ మెరుగుదల..

రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్లు కీలక పాత్ర పోషిస్తాయి.

ఎవరికి మంచిది కాదు?

 అల్లం నమలడం చాలా మంచిదే అయినప్పటికీ, కొందరి విషయంలో ఇది ప్రతికూల ప్రభావాలను చూపవచ్చు.
అల్లాన్ని పరిమితికి మించి ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే నోటిలో మంట లేదా పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది.

సున్నితమైన జీర్ణాశయం ఉన్నవారికి లేదా కడుపులో మంట, ఆసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిటిస్ ఉన్నవారికి రోజూ పచ్చి అల్లం నమలడం వల్ల కడుపులో అసౌకర్యం పెరగవచ్చు.

రక్త ప్రసరణను పలచబరిచే మందులు  వాడేవారు కూడా అల్లాన్ని అధికంగా తీసుకోకూడదు, ఎందుకంటే అల్లానికి కూడా రక్తాన్ని పలచబరిచే స్వభావం కొంతవరకు ఉంటుంది.

తీసుకోవాల్సిన పరిమాణం , జాగ్రత్తలు..

 అల్లం ఆరోగ్యానికి మంచిదే అయినా తీసుకోవలసిన పరిమాణం చాలా ముఖ్యం. మన బొటనవేలి పరిమాణంలో ఉన్న ఒక చిన్న అల్లం ముక్క లేదా రెండు చిన్న పలచటి ముక్కలు సరిపోతాయి. ఒకవేళ పచ్చి అల్లం నమలడం వల్ల కడుపులో మంటగా అనిపిస్తే, దానిని నేరుగా నమలకుండా గోరువెచ్చని నీటిలో అల్లం రసం లేదా అల్లం ముక్కలు వేసి మరిగించి ఆ నీటిని తాగడం మంచిది.

అల్లం అనేది శారీరక ఆరోగ్యానికి మేలు చేసే   ఒక మంచి ఆహార పదార్థం మాత్రమే గానీ, ఏ రోగానికీ పూర్తి స్థాయి చికిత్స లేదా నివారణ కాదు. తరచూ ఆయాసం రావడం, ఎడతెగని తీవ్రమైన దగ్గు ఉండటం, లేదా గుండెలో  నొప్పి వంటివి  ఉన్నట్లయితే, అల్లంపై మాత్రమే ఆధారపడకుండా వెంటనే  వైద్యులను కలిసి సరైన పరీక్షలు చేయించుకోవాలి.

                            *రూపశ్రీ.