రాత్రి పూట బొడ్డుకు ఆవనూనె రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే..!
Published on: Thu Oct 15, 2026 6:28PM
శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి , చిన్నచిన్న అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి మన పెద్దలు ఎన్నో రకాల గృహ వైద్యాలను సూచించారు. అలాంటి వాటిలో నాభిలో నూనె వేసుకోవడం అనేది చాలా కాలంగా వస్తున్న ఒక సాంప్రదాయ పద్ధతి. ముఖ్యంగా శీతాకాలం లేదా మారుతున్న కాలానికి తగినట్లుగా చర్మం పొడిబారడం, పెదవులు పగిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. ఈ నేపథ్యంలో రాత్రి పడుకునే ముందు నాభిలో కొన్ని చుక్కల ఆవనూనె రాసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, దాని వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..
చర్మానికి తేమను అందిస్తుంది..
సాంప్రదాయం వైద్యంలో, ఇంటి చిట్కాలలోనూ, రోజువారీ అలవాట్ల లోనూ నాభికి నూనె రాయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతారు. ఆవనూనెలో సహజ సిద్ధమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన తేమను అందించడంలో సహాయపడతాయి. రాత్రి సమయంలో నిద్రపోయే ముందు బొడ్డు ప్రాంతంలో ఆవనూనెను రాసుకోవడం ద్వారా చర్మం లోపలి నుండి పోషణ పొందుతుంది. ఆయుర్వేదంలో శరీరానికి నూనెతో మర్దన చేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతారు.
పొడి చర్మానికి రక్షణ..
మారుతున్న వాతావరణం కారణంగా చాలా మందిలో చర్మం తేమను కోల్పోయి పొడిబారుతుంది. దీనివల్ల చర్మంపై పీచు వలె గరుకుగా మారడం, లాగడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో ఆవనూనెలో ఉండే కొవ్వు పదార్థాలు చర్మం పైపొరను మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. కేవలం నాభి చుట్టూ మాత్రమే కాకుండా, ఈ నూనె రాయడం వల్ల శరీరంలోని ఇతర భాగాల చర్మానికి కూడా మంచి అనుభూతి కలుగుతుంది. అయితే తీవ్రమైన పొడి చర్మం ఉన్నవారు నేరుగా మంచి మాయిశ్చరైజర్లను ఉపయోగించడం మరింత వేగంగా ఫలితాన్ని ఇస్తుంది.
పగిలిన పెదాలను రిపేర్ చేస్తుంది..
చలికాలం లేదా ఎండ తీవ్రత కారణంగా పెదవులు పగిలిపోవడం చాలా మందిలో కనిపిస్తుంది. పెదవులు పగిలి రక్తం రావడం లేదా ఇబ్బందిగా అనిపించడం జరుగుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నాభిలో రెండు లేదా మూడు చుక్కల ఆవనూనె వేసి సున్నితంగా మర్దన చేయడం వల్ల పెదవులు పొడిబారకుండా మృదువుగా మారుతాయని చెబుతారు. అయితే దీనితో పాటు పెదవుల సంరక్షణ కోసం సాధారణ లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
జీర్ణవ్యవస్థ కు మంచిది..
జీర్ణవ్యవస్థ విషయానికి వస్తే, కడుపులో తేలికపాటి అసౌకర్యం లేదా నొప్పిగా ఉన్నప్పుడు పొట్ట భాగంలో గోరువెచ్చని నూనెతో మర్దన చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఆవనూనె వంటి వాటితో మసాజ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది.
మహిళల నెలసరిలో..
ముఖ్యంగా మహిళలకు నెలసరి సమయాల్లో పొత్తికడుపులో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ పద్ధతి కొంత వరకు మానసిక ప్రశాంతతను , మంచి నిద్రను ఇస్తుంది.
ఎలా ఉపయోగించాలి?
ఆవనూనెను నాభిలో ఎలా ఉపయోగించాలనే సరైన పద్ధతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. రాత్రి పడుకునే ముందు నాభి ప్రాంతాన్ని శుభ్రంగా కడిగి పొడిగా ఉంచుకోవాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు చుక్కల ఆవనూనెను తీసుకుని, నాభిలో , దాని చుట్టూ ఉన్న చర్మంపై సున్నితంగా రాయాలి. దీనిని చాలా గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు అలాగే అతిగా నూనె పోయాల్సిన పని కూడా లేదు. కొద్దిపాటి నూనెతో సున్నితంగా మర్దన చేస్తే సరిపోతుంది.
అయితే ఈ పద్ధతి అందరికీ ఒకేలా సరిపోతుంది అని చెప్పలేము. సున్నితమైన చర్మం ఉన్నవారికి లేదా ఆవనూనె పడని వారికి దీనివల్ల చికాకు, ఎరుపుదనం, దురద లేదా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నూనె రాసిన తర్వాత ఏమైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే కడిగివేయాలి. ఎలాంటి సమస్యలు లేనివారు ఈ చిట్కాను పాటిస్తూ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.



