TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్ జలయజ్ణం కథేంటి?

Published on: Sat Sep 5, 2026 4:17PM

తెలుగువన్ ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరుసగా ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, నీటి విడుదల జరుగుతోంది. అంటే ఏ ప్రాంతానికి నీరు అందని పరిస్థితి ఉందో ఆ ప్రాంతానికి నీటిని అందించే కార్యక్రమం ఏపీలో మొదలవ్వడమే కాదు అది సాకారమయ్యే పరిస్థితి కూడా వచ్చేసింది. ఈ సందర్భంగా వైసీపీ ఆ క్రెడిట్ అంతా తమదేనని బాకాలూదుతోంది. క్రెడిట్ చోరీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నా వైసీపీ వెనక్కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రముఖ విశ్లేషకుడు విక్రమ్ పూల వాస్తవాలను కళ్లకు కట్టారు. 

రాష్ట్రంలో ఇరిగేషన్ పురోగతి వైఎస్ జలయజ్ణంతో మొదలైందనీ, ఆయన తరువాత చేసింది తామేనని చెప్పుకుంటూ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న విక్రమ్ పోలా అసలు జలయజ్ణం కథ ఇదీ అంటూ ఆయన..  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో  జలయజ్ఞం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తొలి దశలో భారీ మరియు మధ్యతరహా ప్రాజెక్టులతో కూడిన సుమారు 26 ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు. అయితే, ఆ సమయంలో రాష్ట్ర బడ్జెట్ పరిమితులకు మించి ప్రాజెక్టులు చేపట్టడం, భారీగా రుణాలు సేకరించడం జరిగిందని చెప్పారు.  ఈ ప్రాజెక్టుల అమలులో భాగంగా కాంట్రాక్టర్ల ఎంపికలో ఈపీఎస్  విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, పెద్దఎత్తున ప్రాజెక్టులు చేపట్టడం, అనుమతులు రాకముందే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడం వంటి పరిణామాలు వివాదాస్పదమన్నారు. జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 

ఇక రాష్ట్ర విభజన తర్వాత  నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎంగా చంద్రబాబు పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత..  సాగునీటి రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపట్టారు. ఆయన  హయాంలో నిధుల కేటాయింపు,  పట్టిసీమ వంటి అనుసంధాన ప్రాజెక్టుల పూర్తి ద్వారా  సాగు, తాగునీరు అందించడంలో పురోగతి సాధించింది.  ఏది ఏమైనా రాజకీయ శంకుస్థాపనలు కాదు.. వాటి ఫలితాలను ప్రజలకు ఎవరైతే అందించారో వారికే క్రెడిట్ దక్కుతుందని విక్రమ్ పూల అన్నారు. జగన్ చేస్తున్నది క్రెడిట్ చోరీ ప్రయత్నమే తప్ప చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు.  

[What Happened Actually In Jalayagnam, YSR Irrigation Projects, AP Politics, Telugu One, Polavaram Project, Jagan Credit Chori]