అతిగా ఆలోచించడం.. ఈ ఒక్క అలవాటు మానేస్తే మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా.!
Published on: Fri Sep 11, 2026 3:17PM
అతిగా ఆలోచించడం.. ఈ ఒక్క అలవాటు మానేస్తే మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా.!
.webp)
రోజంతా ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నా, ఎన్ని పనులు చేస్తున్నా ఒకే విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటున్నా.. అది అతి ఆలోచన అవుతుంది. అతిగా ఆలోచించడం అనేది మనస్సును చాలా అలసిపోయేలా చేసే ఒక నిశ్శబ్ద శత్రువు. చిన్న విషయాన్ని కూడా కొండంత చేసి చూడటం, జరిగిపోయిన విషయాలను పదే పదే తలచుకుని బ్రతకడం లేదా రాని భవిష్యత్తు గురించి భయపడుతూ దానిగురించే ఆలోచించడం.. ఇలాంటి వాటి వల్ల వర్తమానంలో ప్రశాంతత కరువవుతుంది. కానీ, ఎప్పుడైతే ఈ ఒక్క అలవాటును వదిలించుకోగలుగుతామో, ఆ క్షణం నుంచే మన జీవితంలో ఊహించని అద్భుతాలు ప్రారంభమవుతాయి.
అతిగా ఆలోచించడం మానేసినప్పుడు జీవితంలో చోటుచేసుకునే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి వివరంగా తెలుసుకుంటే..
మానసిక ప్రశాంతత , స్పష్టత పెరగడం..
ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో తిరిగే మెదడుకు కాస్త విశ్రాంతి లభిస్తుంది. ఎన్నో విషయాలను ఉరికే ఊహించుకుని భయపడుతూ ఉంటారు.. వాటిని మనసు నుండి తొలగించుకోవడానికి అతి ఆలోచన మానేయడం మంచి మార్గం. దీని వల్ల మనస్సు ప్రశాంతంగా, తేలికగా మారుతుంది. ఏ విషయంలోనైనా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి అనవసరంగా కంగారు పడకుండా, వాటికి సరియైన పరిష్కారాలను కనుగొనడం సులువవుతుంది.
సమయం , శక్తి ఆదా అవ్వడం..
ఆలోచనల సుడిగుండంలో గంటల తరబడి గడపడం వల్ల మానసిక శక్తి శూన్యమవుతుంది. అతిగా ఆలోచించడం ఆపినప్పుడు, ఆ మిగిలిన శక్తిని మన ఎదుగుదలకు ఉపయోగపడే కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి లేదా మన లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి ఉపయోగించవచ్చు. దీనివల్ల జీవితంలో అభివృద్ధి ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
గాఢమైన నిద్ర , మెరుగైన ఆరోగ్యం..
అతిగా ఆలోచించేవారికి రాత్రి వేళల్లో సరిగా నిద్ర పట్టకపోవడం అతిపెద్ద సమస్య. ఆలోచనల ఒత్తిడి తగ్గగానే, ప్రశాంతమైన , గాఢమైన నిద్ర సాధ్యమవుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గి, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా శారీరక ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగుపడుతుంది.
సంబంధ బాంధవ్యాలు బలంగా మారడం..
ఇతరులు అన్న ప్రతి మాటను, చేసిన ప్రతి పనిని విశ్లేషిస్తూ కూర్చుంటే మనుషుల మధ్య విభేదాలు పెరుగుతాయి. ఆ అలవాటును వదిలేస్తే, ఎదుటివారిని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే గుణం అలవడుతుంది. అనవసర అనుమానాలు, భయాలు తొలగిపోయి బంధుమిత్రులతో, భాగస్వామితో అనుబంధం మరింత బలంగా, మధురంగా మారుతుంది.
ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడం..
నేను ఇది చేయగలనా? ఒకవేళ విఫలమైతే ఏంటి పరిస్థితి? అనే అనుమానాలు అతిగా ఆలోచించడం వల్లే వస్తాయి. ఈ అనుమానాల స్థానంలో ఎలా పని చేయాలి? బాగా పని చేయాలంటే ఏం చేయాలి? వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, భయాలు పటాపంచలై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న చిన్న విజయాలు కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తాయి.
వర్తమానంలో జీవించగలగడం..
జీవితంలోని అసలైన సంతోషం ఈ క్షణంలోనే ఉంది. గతం గురించిన బాధలు, భవిష్యత్తు గురించిన దిగులు పక్కన పెట్టినప్పుడు మాత్రమే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించగలుగుతాం. ఇది మనిషికి నిజమైన తృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది.
సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం..
ప్రతి చిన్న విషయానికి ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం తగ్గించినప్పుడే స్వంత ఆలోచనలపై నమ్మకం ఏర్పడుతుంది. జీవితంలో వచ్చే మార్పులను, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే పరిణతి లభిస్తుంది.
అతిగా ఆలోచించడం అనేది ఒకే రోజులో పోయే అలవాటు కాకపోయినా, ప్రయత్నం చేస్తూ ఉంటే.. దాన్ని అదుపు చేయవచ్చు. ఆలోచించడం తగ్గించి, ఆచరించడం మొదలుపెట్టిన క్షణమే జీవితంలో అద్భుతాలు జరగడం మొదలవుతుంది.
*రూపశ్రీ.


