పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే.. ఇదిగో ఇలా పెంచండి..!
Published on: Sat Oct 31, 2026 10:16AM
పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే.. ఇదిగో ఇలా పెంచండి..!

పిల్లలతో అనుబంధం అనేది కేవలం రక్త సంబంధానికి మాత్రమే పరిమితం కాదు. అది పరస్పర నమ్మకం, భావోద్వేగాల కలయికపై ఆధారపడి ఉంటుంది. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు తమ మనసులోని మాటలను, సంతోషాలను, బాధలను ఎలాంటి మొహమాటం లేకుండా తమతో పంచుకోవాలని కోరుకుంటారు. కానీ పిల్లలు పెరిగే కొద్దీ తల్లిదండ్రులకు దూరమవడం, విషయాలు దాచిపెట్టడం సర్వసాధారణంగా మారుతుంటుంది. నిపుణుల పరిశోధనల ప్రకారం దాదాపు అరవై శాతానికి పైగా పిల్లలు తమ రోజువారి సమస్యలను లేదా మానసిక ఇబ్బందిని ఇంట్లో చెప్పకుండా స్నేహితులతో చెప్పుకోవడమూ లేదా ఒంటరితనానికో పరిమితం అవుతున్నారు. దీనివల్ల వారిలో ఆందోళన స్థాయిలు పెరిగే అవకాశం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు తమ మనసును పూర్తిగా తెరిచి మీతో మాట్లాడాలంటే తల్లిదండ్రులు తమ రోజువారీ ప్రవర్తనలో కొన్ని కీలకమైన మార్పులు చేసుకోవడం చాలా అవసరం. అవేంటో తెలుసుకుంటే..
కోపంగా నెగిటివ్ గా రియాక్ట్ కావద్దు..
పిల్లలు ఏదైనా విషయం చెప్పిన వెంటనే వారిని కోప్పడటం లేదా చిన్న విషయానికి కూడా పెద్దది చేసి ప్రతిసారీ తప్పు పట్టడం వంటివి చేయకూడదు. ఇలాంటి నెగిటివ్ రియాక్షన్స్ వల్ల పిల్లలు భవిష్యత్తులో తమకు ఎదురయ్యే సమస్యలను ఇంట్లో చెప్పడానికి చాలా భయపడతారు. అలాగే పిల్లలు చెప్పే చిన్న సమస్యలను పెద్దవారు చాలాసార్లు చిన్నచూపు చూస్తుంటారు. పెద్దల దృష్టిలో అది సాధారణ విషయంగా అనిపించవచ్చు కానీ లేత మనసులున్న పిల్లలకు ఆ సమస్య ఎంతో భారంగా అనిపించే అవకాశం ఉంది. అందుకే వారి ఎమోషన్స్ ను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు.
పోల్చకండి..
పిల్లలను పక్కవారితో లేదా తోటి విద్యార్థులతో పోల్చడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఎప్పుడూ వేరేవారితో పోలికలు తేవడం వల్ల పిల్లలలో అసూయతో పాటు తల్లిదండ్రులపై నమ్మకం సన్నగిల్లుతుంది. దీనికి బదులుగా వారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం మంచిది. ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే గట్టిగా పనిష్మంట్ ఇస్తామని బెదిరించడం వల్ల పిల్లలు నిజం చెప్పడానికి బదులుగా అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటారు. తప్పులను వివరంగా చెప్పి, వాటి పర్యావసానం ఎలా ఉంటుందో అర్థం చేయించడం ద్వారా పిల్లలలో మార్పు తీసుకురావచ్చు.
పిల్లలు చెప్పేది వినాలి..
పిల్లలు ఏదైనా చెప్పేటప్పుడు వారి మాట మధ్యలో అడ్డుకోవడం లేదా వెంటనే నీకు ఏమీ తెలియదు అంటూ కొట్టిపడేయడం చేయకూడదు. వారు చెప్పాలనుకున్నది పూర్తిగా విన్న తర్వాతే తల్లిదండ్రులు అభిప్రాయాన్ని చెప్పాలి. పిల్లలు నమ్మి చెప్పిన రహస్యాలను ఇతరుల ముందు లేదా బంధువుల ముందు చెప్పడం వల్ల వారి నమ్మకం పూర్తిగా దెబ్బతింటుంది. పిల్లల వ్యక్తిగత విషయాలకు ఎప్పుడూ భద్రత కల్పించాలి. కేవలం చదువు, మార్కులు, భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడకుండా వారికి ఏ విషయాల పైన ఆసక్తి ఉందో.. ఏం చేయాలని ఆసక్తి ఉందో తెలుసుకుంటూ.. సరదా విషయాల గురించి కూడా ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి మాట్లాడాలి. ఈ చిన్నపాటి మార్పుల ద్వారా పిల్లలతో మంచి బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో అన్నీ షేర్ చేసుకోవచ్చు అని ధైర్యంతో ఉంటారు.
*రూపశ్రీ.


