TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీవితంలో ఎదగాలన్నా,  శత్రువులను చిత్తు చేయాలన్నా..చాణక్యుడు చెప్పినట్టు ఇలా చేయండి..!

Published on: Sat Oct 31, 2026 7:30PM

జీవితంలో ఎదగాలన్నా,  శత్రువులను చిత్తు చేయాలన్నా..చాణక్యుడు చెప్పినట్టు ఇలా చేయండి..!

జీవితంలో ప్రశాంతంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సమాజంలో లేదా పని చేసే చోట కొందరు వ్యక్తులు మన ఎదుగుదలను చూసి ఓర్వలేక శత్రువులుగా మారుతుంటారు. అలాంటి వారిని ఎదుర్కొనేందుకు కేవలం శారీరక బలం లేదా కక్ష సాధింపు సరిపోవని ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు. శత్రువులను శాశ్వతంగా ఓడించాలంటే శారీరక శక్తి కంటే మానసిక పరిపక్వత, చాతుర్యం చాలా ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే ఛాలెంజ్ లను, శత్రువులను ఎలా ఎదుర్కోవాలో ఆచార్య చాణక్యుడు తన చాణక్య  నీతిలో  అద్బుతంగా వివరించాడు. వాటిని మన దైనందిన జీవితానికి అన్వయించుకుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా జయించవచ్చు. అవేంటో తెలుసుకుంటే..

ప్రవర్తన..

మనం నడుచుకునే తీరు, మాట్లాడే విధానం , పరిస్థితులను అంచనా వేసే పద్ధతే మనల్ని విజేతగా నిలబెడుతుంది. శత్రువులు మనపై ఆధిపత్యం చెలాయించాలని చూసినప్పుడు మనం కోపం చేసుకోకుండా  వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.

మౌనం..

మౌనం అనేది అన్ని సమయాలలోనూ బలహీనత కాదు. ఎవరైనా మనల్ని కవ్విస్తున్నప్పుడు లేదా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారీ వెంటనే రెస్పాండ్ కావాల్సిన  అవసరం లేదు. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండటమే శత్రువుకు అతిపెద్ద సమాధానం అవుతుంది. మనం వెంటనే బదులు ఇవ్వకపోతే, అవతలి వ్యక్తికి మన తర్వాత  ఆలోచన ఏమిటో,  ఏం చేస్తామో అనేది అంతుచిక్కదు. దీనివల్ల వారు గందరగోళానికి గురవుతారు. కాబట్టి అనవసరమైన వాదనలకు దిగి శక్తిని వృథా చేసుకునే బదులు నిశ్శబ్దంగా ఉండి సరైన సమయం కోసం వేచి చూడటం మంచిది.

అజాగ్రత్త..

ఎవరినైనా ఎదుర్కొనేటప్పుడు లేదా పోటీ పడేటప్పుడు వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అవతలి వ్యక్తి ఎంత చిన్నవాడైనా, బలహీనుడైనా సరే వారిలో ఉండే ప్రత్యేక నైపుణ్యాలు లేదా వారి ప్రణాళికలు  ప్రమాదకరంగా మారవచ్చు. శత్రువును బలహీనుడిగా భావించి అజాగ్రత్తగా ఉంటే అది మనకే నష్టాన్ని తెస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

గోప్యత..

మన జీవితానికి లేదా భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదు. మన ఆలోచనలు, చేసే పనులు ముందుగానే ఇతరులకు తెలిస్తే , మన మంచి ఓర్వలేని వారు వాటిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మన విజయానికి బాటలు వేసే ప్రణాళికలు పూర్తిగా అమలయ్యే వరకు వాటిని గోప్యంగా ఉంచడమే అత్యంత సురక్షితమైన మార్గం.

తొందరపాటు..

ఏదైనా రంగంలో ముందుకు వెళ్లాలంటే ముందుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను సరిగ్గా అర్థం చేసుకోవాలి. శత్రువు బలాలు ఏమిటి, వారి బలహీనతలు ఏమిటి అనే విషయాలపై స్పష్టత ఉండాలి. వారి ఆలోచనా విధానాన్ని బట్టి మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అంచనా వేయవచ్చు. ఆలోచించకుండా తొందరపాటుతో అడుగులు వేసే బదులు  ఆచి తూచి అడుగు వేయడం ఎప్పుడూ మంచిది.

కోపం..

కోపం అనేది మనిషిలో ఉన్న విచక్షణా జ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. కోపంతో తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ మీ భావోద్వేరాల నియంత్రణ కోల్పోకూడదు. ప్రశాంతమైన మనసుతో ఆలోచించి తీసుకునే నిర్ణయాలే ఎప్పుడూ సరైన ఫలితాలను ఇస్తాయి.

మెరుగవ్వాలి..

ప్రతి రోజూ ఏదో ఒక విషయం నేర్చుకుని మెరుగవుతూ ఉండాలి. మన విద్య, జ్ఞానం, నైపుణ్యాలు , అనుభవాన్ని పెంచుకోవడం ద్వారా మానసికంగా బలపడవచ్చు. మెంటల్ గా బలవతులుగా ఉన్నప్పుడు   ఎలాంటి శత్రువులైనా మనల్ని సులభంగా ఓడించలేరు. ప్రతి వ్యక్తికి  కష్టపడే తత్వమే వారి బలానికి అసలుసిసలైన ఆధారం అవుతుంది.

భయాన్ని వదిలిపెట్టాలి..

అన్నింటికంటే ముఖ్యంగా మన మనసులో ఉండే భయమే మన అతిపెద్ద శత్రువు. భయం కారణంగా మనిషి సరైన నిర్ణయాలు తీసుకోలేడు. ఏ సవాల్‌నైనా ఎదుర్కొనే ముందు మనసులో ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలి. భయాన్ని వీడి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి దానంతట అదే తొలగిపోతుంది.

                                                                                                                                         *రూపశ్రీ.