TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బలమైన భార్యాభర్తల బంధానికి, డబ్బుకు ఉన్న లింకు ఇదే.. 

Published on: Wed Oct 14, 2026 10:54AM

బలమైన భార్యాభర్తల బంధానికి, డబ్బుకు ఉన్న లింకు ఇదే.. 

పెళ్లి అనేది కేవలం ఇద్దరు మనుషులు ఒక్కటి కావడం కాదు. ఇద్దరి అలవాట్లు, వాళ్ళ మనసులు, వాళ్ళ బాధ్యతలు కూడా కలిసి ఉండే బంధం.  భార్యాభర్తల  మధ్య ప్రేమ, నమ్మకం ఎంత ముఖ్యమో, ఆర్థిక విషయాలలో స్పష్టత కూడా అంతే అవసరం. వివాహ బంధంలో చాలా సమస్యలు లేదా గొడవలు నేరుగా మనస్పర్ధల వల్ల కాకుండా, ఆర్థిక విషయాలలో సరైన సమాచారం, అవగాహన లేకపోవడం వల్లే మొదలవుతుంటాయి. ఆదాయం, ఖర్చులు, పొదుపు, అప్పుల విషయంలో ఇద్దరి మధ్య పారదర్శకత లేకపోతే కాలక్రమేణా ఆ బంధంలో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే పెళ్లయిన కొత్తలోనే లేదా సంసార ప్రయాణంలో దంపతులిద్దరూ కూర్చుని డబ్బుకి సంబంధించిన ముఖ్యమైన విషయాలను చర్చించుకోవడం ఎంతో అవసరం. ఆర్థిక ప్రణాళికలు సరైన మార్గంలో ఉంటేనే దాంపత్య జీవితం ఆనందంగా, మానసిక ప్రశాంతతతో సాగుతుంది..  

ఆర్థిక బలంగా ఉండాలన్నా  , భార్యాభర్తల బంధం బలంగా ఉండాలన్నా..ప్రతి భార్యాభర్తలు తప్పకుండా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అవేంటో తెలుసుకుంటే ..

ఇద్దరి సంపాదన , ఆదాయం వివరాలు..

భార్యాభర్తలిద్దరికీ ఒకరి ఆదాయం గురించి మరొకరికి స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకవేళ ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నట్లయితే, ఇద్దరి నెలవారీ సంపాదన, వచ్చే బోనస్‌లు లేదా ఇతర ఆదాయ మార్గాల గురించి ఓపెన్ గా  మాట్లాడాలి. ఎవరి ఆదాయం ఎంత ఉందో తెలిసినప్పుడే ఇంటి బడ్జెట్‌ను సరిగ్గా నిర్వహించడం , భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడం తేలికవుతుంది. ఇక్కడ సంపాదన తక్కువ లేదా ఎక్కువ అనేది ముఖ్యం కాదు, ఇద్దరు ట్రాన్స్పరెంట్ గా ఉండటమే  ప్రధానం.

ఇంటి ఖర్చుల నిర్వహణ , బాధ్యతల విభజన..

 ఇంటి అద్దె, గ్రోసరీస్, కరెంట్ బిల్లులు, పిల్లల చదువుల ఖర్చులు వంటి రెగ్యులర్  ఖర్చులను ఎవరు, ఎలా భరించాలో ముందుగానే మాట్లాడుకోవడం   మంచిది. ప్రతి ఖర్చునూ సగం సగం షేర్ చేసుకోవాలనే రూల్  ఏమీ లేదు. భార్యాభర్తలిద్దరూ  వారి ఆదాయం, వీలును బట్టి ఇద్దరికీ అనుకూలంగా ఉండేలా ఖర్చులను అడ్జస్ట్ చేసుకోవచ్చు.

 పొదుపు..

 కేవలం సంపాదించడం, ఖర్చు పెట్టడమే కాకుండా భవిష్యత్తు భద్రత కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం. నెలకు ఎంత మొత్తం పొదుపు చేయాలి, ఆ మొత్తాన్ని ఎక్కడ దాచాలి లేదా పెట్టుబడి పెట్టాలి అనే దానిపై ఇద్దరూ ఒక నిర్ణయానికి రావాలి. చిన్న మొత్తంతో మొదలుపెట్టినా, క్రమబద్ధమైన పొదుపు అలవాటు అత్యవసర సమయాల్లో ఎంతగానో ఆదుకుంటుంది.

అప్పులు , ఈఎంఐలు..

పెళ్లికి ముందు ఉన్న అప్పులు, పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు లేదా క్రెడిట్ కార్డ్ బాకీల గురించిన నిజాలను ఒకరికొకరు నిజాయితీగా చెప్పుకోవాలి. అప్పులు ఎంత ఉన్నాయి, వాటికి నెలకు ఎంత ఈఎంఐ చెల్లిస్తున్నారు అనే వివరాలు భాగస్వామికి తెలియడం వల్ల అనవసర టెన్షన్లు తగ్గిపోతాయి. దాపరికం లేకుండా అప్పుల విషయాన్ని పంచుకోవడం ద్వారా ఇద్దరూ కలిసి త్వరగా వాటిని తీర్చే ప్రణాళిక వేసుకోవచ్చు.

లాంగ్ టర్మ్ ఫైనాన్సియల్ గోల్స్..

ప్రతి జంటకు భవిష్యత్తు గురించి కొన్ని కలలు, లక్ష్యాలు ఉంటాయి. సొంత ఇల్లు కొనడం, పిల్లల  చదువులు, వ్యాపారం ప్రారంభించడం లేదా రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి విషయాలపై ఇద్దరి ఆలోచనలు ఎలా ఉన్నాయో మాట్లాడుకోవాలి. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి ఎన్నాళ్ల సమయం పడుతుంది, ఎలా ముందుకు వెళ్లాలి అనేది ముందే నిర్ణయించుకుంటే ఒక స్పష్టత వస్తుంది.

కుటుంబ సభ్యుల బాధ్యతలు , సహాయం..

చాలామందికి తమ తల్లిదండ్రులకు లేదా తోబుట్టువులకు ఆర్థికంగా సహాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ విషయంలో పరస్పరం గౌరవం, అర్థం చేసుకునే తత్వం అవసరం. కుటుంబాలకు ఎంతవరకు సాయం చేయవచ్చు, దానికి ఎంత బడ్జెట్ కేటాయించవచ్చు అనేది ముందే మాట్లాడుకుంటే, తర్వాత కాలంలో సంసారంలో అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయి.

పెద్ద నిర్ణయాలు , వ్యక్తిగత స్వేచ్ఛ..

ఏదైనా పెద్ద వస్తువు కొనాలన్నా, అప్పు తీసుకోవాలన్నా లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలన్నా ఇద్దరూ సంప్రదించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరికీ తమ సొంత అవసరాల కోసం కొంత డబ్బును ఉపయోగించుకునే స్వేచ్ఛ కూడా ఉండాలి. ఉమ్మడి లక్ష్యాలతో పాటు వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని గౌరవించినప్పుడే ఆ బంధంలో నమ్మకం, గౌరవం మరింత పెరుగుతాయి.

                          *రూపశ్రీ.