TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వివాహం తర్వాత ప్రేమ నిలబడాలంటే.. ఈ విషయాలు తప్పక మాట్లాడుకోవాలి.

Published on: Sun Oct 25, 2026 3:08PM

వివాహం తర్వాత ప్రేమ నిలబడాలంటే.. ఈ విషయాలు తప్పక మాట్లాడుకోవాలి..!

వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తులు కలసి ఒకే ఇంట్లో ఉండటం మాత్రమే కాదు. కాలంతో పాటు ఉద్యోగ బాధ్యతలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం వంటి అనేక విషయాలు  దంపతుల జీవితంలో భాగమవుతాయి. పెళ్లైన మొదట్లో  ఉన్న అనురాగం క్రమంగా రోజువారీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ల మధ్య కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే, ఎన్నో  జంటలు తమ మనసులోని ఆలోచనలను లేదా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందులను భాగస్వామితో సరిగ్గా పంచుకోకపోవడం వల్ల, ఆ సమస్యలు రానురాను పెద్దవిగా మారి ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. బంధం ఎప్పుడూ బలంగా, సంతోషంగా సాగాలంటే దంపతుల మధ్య ఎప్పుడూ  ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్  జరగడం చాలా అవసరం. నెలకు కనీసం ఒకసారైనా ఒక చోట ప్రశాంతంగా కూర్చుని, ఎలాంటి విమర్శలు లేదా వాదనలు లేకుండా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ముచ్చటించుకోవడం వల్ల దంపతుల మధ్య అవగాహన మరింత పెరుగుతుంది.

 ఆర్థిక విషయాలు..

దంపతులు ప్రతి నెలా పంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో మొదటిది ఆర్థిక విషయాలు , ఖర్చులు. కుటుంబ ఆదాయం ఎంత, నెలకు ఎంత ఖర్చు అవుతోంది, పొదుపు ఎంత చేయాలి, ముందస్తుగా ఎదురయ్యే పెద్ద ఖర్చులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై ఇద్దరూ స్పష్టత తెచ్చుకోవాలి. ఆర్థిక ప్రాధాన్యతలు ఇద్దరికీ భిన్నంగా ఉన్నప్పటికీ, వాటిని ఒకరికొకరు వివరించి అర్థం చేసుకోవడం వల్ల అనవసరమైన ఆర్థిక ఒత్తిళ్లు తగ్గుతాయి.

ఎమోషన్స్..

బంధంలో కేవలం అంతా బాగానే ఉందా అని అడిగితే సరిపోదు. జీవిత భాగస్వామి మనసులోని భావాలను, వారికి ఏమైనా లోటుగా అనిపిస్తోందా లేదా అనే విషయాలను తెలుసుకోవాలి. చిన్న చిన్న అసంతృప్తులను మొదట్లోనే  గుర్తించి వాటిని అడిగి తెలుసుకోవడం  ద్వారా పెద్ద గొడవలను నివారించవచ్చు.

 ఇంటి బాధ్యతలు..

ఇంటి బాధ్యతలను విభజించుకోవడం కూడా భార్యాభర్తలు తప్పక మాట్లాడుకోవాలి. వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, ఇంటికి కావలసిన వస్తువులు కొనడం, బిల్లులు చెల్లించడం వంటి పనుల భారం కేవలం ఒక్కరిపైనే పడితే అది క్రమంగా విసుగుకు దారితీస్తుంది. అందుకే నెలకు ఒకసారి ఇంటి బాధ్యతల గురించి మాట్లాడుకుని , పనులను ఇద్దరూ సమానంగా పంచుకోవడం ద్వారా సహకారాన్ని పెంచుకోవచ్చు.

కుటుంబాలతో సంబంధాలు..

ఇరువైపుల కుటుంబాలు,  బంధువులతో సంబంధాలు కూడా చాలా ముఖ్యం. రెండు కుటుంబాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు లేదా ఒత్తిళ్లు ఉన్నప్పుడు వాటిని దాచిపెట్టకుండా ప్రశాంతంగా చర్చించాలి. తన మాటలను భాగస్వామి వింటున్నారనే నమ్మకం అవతలి వ్యక్తికి కలిగేలా వాతావరణం ఉండాలి.

పర్సనల్ టైమ్..

పెళ్లయినంత మాత్రాన వ్యక్తిగత ఆసక్తులు లేదా సొంత సమయాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. దంపతులు ఇద్దరూ తమకు కేటాయించుకునే పర్సనల్  సమయంతో పాటు, కేవలం ఇద్దరే ప్రశాంతంగా గడిపే సమయాన్ని కూడా నెలకు కొంతవరకు కేటాయించుకోవడం బంధానికి కొత్త ఊపిరిని ఇస్తుంది.

 భవిష్యత్తు ప్రణాళికలు..

ఉద్యోగం, కొత్త ఇల్లు కొనడం, ప్రయాణాలు, పిల్లల భవిష్యత్తు లేదా దీర్ఘకాలిక పొదుపు వంటి విషయాల్లో ఇద్దరి ఆలోచనలు ఒకేలా లేకపోయినా, పరస్పరం చర్చించుకోవడం ద్వారా ఒకరి ప్రాధాన్యతలను మరొకరు అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
 

ఒకరినొకరు మెచ్చుకోవడం..

భార్యాభర్తల కమ్యూనికేషన్ అనేది  కేవలం సమస్యలను పరిష్కరించడానికో లేదా అవసరం కొద్ది మాట్లాడటమూ  కాకుండా, భాగస్వామి చేసిన మంచి పనులను గుర్తించడానికి కూడా ఉపయోగపడాలి. భాగస్వామిలోని మంచి గుణాలను, వారు అందించిన సహకారాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం వల్ల దంపతుల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడి బంధం మరింత మధురంగా మారుతుంది.

                                                                                                                                         *రూపశ్రీ.