వీఆర్‌కే డైట్ వీరమాచినేని రామకృష్ణపై కేసు: ఎందుకో తెలుసా?
Published on: Wed Sep 30, 2026 2:20PM

తెలుగు రాష్ట్రాల్లో వీఆర్‌కే డైట్ తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను మందులు లేకుండా కేవలం డైట్ ద్వారానే నయం చేయవచ్చంటూ ఆయన ఇస్తున్న సలహాలు వివాదానికి దారితీశాయి.
ముఖ్యంగా, టైప్ 1 డయాబెటిస్‌తో బాధపడుతున్న ఓ 30 ఏళ్ల యువకుడు, లా విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. వైద్యుల అనుమతి లేకుండా, ఎలాంటి అధికారిక అర్హత లేకపోయినా ఆయన రోగులకు తప్పుడు వైద్య సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడైన లా విద్యార్థి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. వీరమాచినేని రామకృష్ణ, కోటేశ్వరరావుల సలహా మేరకు తాను ఇన్సులిన్ వాడకం ఆపేశానని, దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తి డయాబెటిక్ కీటోఅసిడోసిస్ బారిన పడ్డానని తెలిపాడు.

దీంతో అతన్ని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆ సమయాన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం అతనికి సుమారు 58,219 రూపాయలు ఖర్చు అయ్యింది. . అంతకుముందు, వీఆర్‌కే హెల్త్ కేర్ సెంటర్‌లో డైట్ సలహాలు, సప్లిమెంట్ల కోసం సదరు విద్యార్థి దాదాపు 2కవేల రూపాయలు చెల్లించినా, అందుకు ఇచ్చిన బిల్లులో జీఎస్టీ వివరాలు లేవు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ కోర్టు ద్వారా సోషల్ మీడియాలో వీఆర్‌కే కంటెంట్‌ను నియంత్రించేలా ఆదేశాలు తెచ్చుకుంది.
అంతేకాకుండా, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం-1954 లోని సెక్షన్లు 3, 4 ప్రకారం తప్పుదారి పట్టించే ప్రకటనలు, వైద్య నిబంధనల ఉల్లంఘన కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రస్తుతం ఈ పరిణామం సోషల్ మీడియాలోనూ, వైద్య వర్గాలలోనూ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లు యెన్సర్లు ఇస్తున్న ఇటువంటి అనధికారిక ఆరోగ్య సలహాలు, డైట్ ప్లాన్‌లు సామాన్యుల ప్రాణాల కుముప్పుగా మారుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
[VRK Diet, Veeramachaneni Ramakrishna, Cyberabad Police, VRK Diet controversy, Fake Doctor Case, Medical Fraud Case, Telugu One]


