వోక్స్ వ్యాగన్ లో ఉద్యోగుల తొలగింపు.. ఎంత మందినో తెలుసా?
Published on: Fri Sep 4, 2026 8:57AM

దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న జర్మనీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ తన చరిత్రలోనే అతి పెద్ద రిట్రెంచ్ మెంట్ కు తెర తీసింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఆర్ధిక ఒత్తిళ్లు, చైనా ఎలక్ట్రిక్ వాహనాల నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకునేందుకు కంపెనీ మేనేజ్‌మెంట్, ట్రేడ్ యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా లక్ష మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్యను క్రమబద్ధీకరించడం అనివార్యమనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ వోక్స్ వ్యాగన్ మేజేజ్ మెంట్ వర్గాలు తెలిపాయి.
నిజానికి గతంలోనే 50 వేల ఉద్యోగాల్లో కోతకు ట్రేడ్ యూనియన్లతో ఒప్పందం కుదిరింది. తాజా పరిణామాలతో ఆ 50 వేల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా వోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో మొత్తం 6.67 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఈ తాజా కోతలతో దాదాపు 15 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదు. వోక్స్‌వ్యాగన్ ఉద్యోగుల్లో దాదాపు 43 శాతం మంది ఒక్క జర్మనీలోనే పనిచేస్తుండటంతో.. ఈ రిట్రెంచ్ మెంట్ ప్రణాళిక మేరకు జర్మనీ ఉద్యోగులే అధికంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది.

మార్కెట్ అంచనాల ప్రకారం, దశాబ్దాలుగా నిర్మాణ సంస్కరణలను వాయిదా వేయడం వల్లే వోక్స్ వ్యాగన్ కు ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైంది. గతంలో చైనా మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న వోక్స్‌వ్యాగన్, అక్కడి ఎలక్ట్రిక్ వాహన దిగ్గజాలైన బీవైడీ , గీలీ వంటి కంపెనీలతో పోటీ పడలేక వెనుకబడింది. ఈ వెనుక బాటు కేవలం చైనాకే పరిమితం కాలేదు.. చైనా ఎలక్ట్రిక్ వాహనాలు ఐరోపా మార్కెట్లోకి కూడా విస్తరించి సక్సెస్ కావడంతో వోక్స్‌వ్యాగన్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అమెరికా టాక్స్ టెర్రర్ ఒత్తిళ్లు, పడిపోతున్న అమ్మకాలు, వపెరిగిన ఉత్పత్తి వ్యయాల కారణంగా కంపెనీ భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు తక్షణ వ్యయ నియంత్రణ చర్యలు అత్యవసరమని వోక్స్ వ్యాగన్ యాజమాన్యం నిర్ణయానికి వచ్చింది.
[Volkswagen job cuts, Volkswagen layoffs, VW 100000 job cuts, Volkswagen restructuring, German car giant layoffs, Telugu One]


