TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖ టు భోగాపురం ఎయిర్ పోర్ట్: సముద్ర మార్గం.. క్రూయిజ్ సేవల అనుసంధానం.!

Published on: Sat Oct 3, 2026 11:33AM

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని మరింత విస్తరించడంతో పాటు రవాణా సదుపాయాలను మెరుగుపరిచే  దిశగా కొత్త కొత్త ప్రణాళికలు, వినూత్న మార్గాలను అందుబాటులోనికి తీసుకువస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా విశాఖ పట్నం నుంచి  భోగాపురంలోని అంతర్జాతీయ విమానా శ్రయానికి సముద్ర మార్గంలో క్రూయిజ్ సేవలను అనుసంధానించే ప్రణాళికనుప్రతిపాదించింది.  ఈ   సేవలు అందుబాటులోకి వస్తే విశాఖ తీరప్రాంత పర్యాటకానికి కొత్త అవకాశాలు ఏర్పడటంతో పాటు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా మార్గం కూడా అందుబాటులోకి వస్తుంది.  

విశాఖపట్నానికి ఇప్పటికే అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ అందుబాటులో ఉంది. రాష్ట్ర పర్యాటక విధానం 2024–29లో భాగంగా విశాఖ నుంచి దేశీయ, అంతర్జాతీయ ప్రాంతాలకు క్రూయిజ్ మార్గాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సముద్ర మార్గంలో ప్రయాణ సదుపాయాలను విస్తరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది.  

భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం. . విశాఖ నగరం నుంచి భోగాపురం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించే వారికి ప్రత్యామ్నాయంగా సముద్ర మార్గాన్ని వినియోగించే ప్రతిపాదన అమలులోకి వస్తే.. ఇదొక వినూత్న ప్రయాణ అనుభవం అవుతుందనడంలో సందేహం లేదు.   క్రూయిజ్ సేవల ద్వారా విమానాశ్రయానికి చేరుకునే మార్గం సాధ్యాసాధ్యాలు, ప్రయాణ సమయం, ప్రయాణికుల భద్రత, టెర్మినల్ సదుపాయాలు తదితర అంశాలపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది.  

విశాఖ నుంచి భీమిలి, శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంతాల వైపు మినీ క్రూయిజ్ సేవలను ప్రవేశపెట్టే ప్రతిపాదనలు గతంలో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.  80 మంది ప్రయాణించే సామర్థ్యమున్న మినీ క్రూయిజ్‌ల నిర్వహణకు సాంకేతిక సాధ్యాసాధ్యాలు ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్నాయి. అంతే కాకుండా  సముద్రంలో యాచ్‌లలో రాత్రి బస  ప్రతిపాదనలు, ప్రణాళికలు కూడా పరిశీలన దశలో ఉన్నాయి.  ఈ  ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే విశాఖ  సముద్ర పర్యాటక కేంద్రంగా మారుతుంది.  

[Vizag Bhogapuram Airport,  Cruise Services, Bhogapuram International Airport, Vizag Water Transport, Tourism Developement, Telugu One]