TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

Viveka Murder Case: రెండో రోజు కొనసాగిన ఈడీ విచారణ.!

Published on: Tue Sep 29, 2026 9:22PM

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ రెండో రోజూ కొనసాగుతోంది. ఈ కేసులో A1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, A3గా ఉన్న గజ్జల ఉమాశంకర్‌రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హత్య కేసులో ఆర్థిక లావాదేవీలు, డబ్బు సమీకరణ, నిందితుల మధ్య సంబంధాలు తదితర అంశాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. 2019 మార్చి 15న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో జరిగినట్లు చెబుతున్న సమావేశానికి సంబంధించిన అంశాలపై ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి హత్య అనంతరం ఉమాశంకర్‌రెడ్డి గోడ దూకి పారిపోయినట్లు నమోదైన సీసీటీవీ ఫుటేజీకి సంబంధించిన వివరాలపైనా ఈడీ ఆరా తీస్తున్నారు.

ఇటీవల ఆగస్టులో హైదరాబాద్‌, కడపలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో లభించినట్లు చెబుతున్న ఆధారాలను కూడా విచారణలో ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, నిందితుడు సునీల్‌ యాదవ్‌ ఇచ్చిన వాంగ్మూలాల్లోని అంశాల ఆధారంగా కూడా ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఎర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి మధ్య జరిగినట్లు చెబుతున్న బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన వందలాది ఫోన్‌ కాల్స్‌, వాటి సమయాలు, సంభాషణల నేపథ్యంపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. వివేకా హత్యకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ఈడీ ప్రధానంగా ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హత్యకు సుపారీగా రూ.40 కోట్లు ఎవరు సమకూర్చాలని ప్రయత్నించారు? ఆ మొత్తానికి సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి చేరింది? ఎవరెవరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి? అనే అంశాలపై అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. గజ్జల ఉమాశంకర్‌రెడ్డిపై ఈడీ అధికారులు విస్తృతంగా ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తోంది. 

హత్య జరిగిన రోజు ఆయన కదలికలు, ఎర్ర గంగిరెడ్డితో ఉన్న సంబంధాలు, ఫోన్‌ కాల్స్‌, ఆర్థిక లావాదేవీలు, హత్య అనంతరం జరిగిన పరిణామాలపై వివరాలు కోరుతున్నట్లు సమాచారం.అలాగే ఈ కేసులో నార్కో అనాలసిస్‌ పరీక్షకు ఎందుకు అంగీకరించలేదనే అంశంపైనా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గతంలో దర్యాప్తు సంస్థలు సేకరించిన వాంగ్మూలాలు, సీసీటీవీ ఫుటేజీ, కాల్‌ డేటా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను సమన్వయం చేసుకుంటూ ఈడీ విచారణ కొనసాగిస్తున్నారు.హత్య వెనుక ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవహారాల మూలాలను గుర్తించడమే లక్ష్యంగా ఈడీ విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది.

 

 

 

[ Viveka Murder Case, ED investigation, Erra Gangireddy, Umashankar Reddy, Money Laundering Investigation, ED Hyderabad, YS Jagan, Telugu One, Telugu News ]