విశాఖ హెచ్ పీసీఎల్ లో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన నల్లటి పొగతో ఉక్కిరిబిక్కిరైన జనం.!
Published on: Tue Nov 3, 2026 7:31AM

విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) రిఫైనరీ ప్రాంగణంలో మంగళవారం (నవంబర్ 2) రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నూతనంగా నిర్మించిన కూలింగ్ టవర్ ప్రాంతంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదం కారణంగా ప్రాంగణమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకోవడంతో స్థానికులు తీవ్ర తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రిఫైనరీకి సమీపంలో ఉన్న మల్కాపురం, శ్రీహరిపురం, సింధియా తదితర ప్రాంతాల ప్రజలు దట్టమైన పొగ కారణంగా ఉక్కిరిబిక్కిరై ఇబ్బందులు పడ్డారు. విషవాయువులు విడుదలవుతున్నాయనన్న భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రిఫైనరీకి చెందిన అంతర్గత రక్షణ సిబ్బందితో పాటు అగ్నిమాపక యంత్రాంగం సంయుక్తంగా మంటలను అదుపు చేశాయి. రిఫైనరీ ప్రాంగణంలోని ఇతర ప్లాంట్లకు మంటలు పాకకుండా చర్యలు తీసుకున్నారు.

ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సాంకేతిక లోపమా, మరేదైనా కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. . ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. రక్షణ చర్యల్లో భాగంగా ప్లాంట్ అధికారులు ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరాని నిలిపివేసి, ప్రమాద ప్రాంతంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


