TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖలో అర్ధరాత్రి హైవేపై ఛేజింగ్.. రూ.9 కోట్ల బంగారం పట్టివేత.!

Published on: Sun Oct 11, 2026 11:43AM

విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది. ఓవైపు అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న కారు.. మరోవైపు ఆ వాహనాన్ని వెంబడిస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు.. కొద్దిసేపు హైవేపై ఉత్కంఠ నెలకొంది. చివరకు కారును అడ్డుకున్న అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ఏకంగా రూ.9 కోట్ల విలువైన బంగారం బయటపడింది.
కోల్‌కతా నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా హైదరాబాద్‌కు భారీ మొత్తంలో బంగారం అక్రమంగా తరలిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కోల్‌కతా నుంచి వస్తున్న ఓ అనుమానాస్పద కారును గుర్తించి ఆపేందుకు ప్రయత్నించారు.

అయితే అధికారులను గమనించిన కారు డ్రైవర్ వేగాన్ని పెంచి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో డీఆర్‌ఐ అధికారులు తమ వాహనాలతో కారును వెంబడించారు. కొంతదూరం హైవేపై ఛేజింగ్‌ కొనసాగిన అనంతరం.. పక్కా వ్యూహంతో కారును అడ్డగించి అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. మొదట కారును తనిఖీ చేసిన అధికారులకు ఎక్కడా బంగారం కనిపించలేదు. అయితే నిందితులను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా కారు డాష్‌బోర్డ్‌, ఇంజిన్‌ పరిసర ప్రాంతాల్లోని రహస్య భాగాల్లో బంగారు బిస్కెట్లను దాచిపెట్టినట్లు గుర్తించారు.

కారు రహస్య భాగాల నుంచి సుమారు ఆరు కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని మార్కెట్ విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారంతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.కోల్‌కతా నుంచి ఈ బంగారాన్ని ఎవరు పంపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎవరికి అందించాల్సి ఉంది.. ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. హైవేపై హైస్పీడ్ ఛేజింగ్‌.. కారులో రహస్యంగా దాచిన కోట్ల విలువైన బంగారం విశాఖలో వెలుగుచూసిన ఈ ఘటనతో బంగారం అక్రమ రవాణా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

 

 

[ Visakhapatnam Gold Seizure, DRI Gold Seizure, ₹9 Crore Gold, 6 Kg Gold Seized, Gold Smuggling, Vizag News, Visakhapatnam News, Gold Smuggling Case, DRI Officials, Kolkata to Hyderabad Gold Smuggling, Gold Biscuits Seized, Andhra Pradesh News, Hyderabad Gold Smuggling, Highway Car Chase, Gold Smuggling Investigation, Latest Telugu News, TeluguOne, Breaking News ]