వినుకొండలో రూ.239.91 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు పనులను శ్రీకారం..!
Published on: Sun Aug 23, 2026 5:21PM

అమృత్ 2.0 పథకం కింద రూ.239 కోట్లతో పనులను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి..!
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణవాసుల దశాబ్దాల తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది. పట్టణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, రక్షిత మంచి నీటిని నిరంతరం అందించాలనే లక్ష్యంతో రూ. 239.91 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మక తాగునీటి అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించారు.
ఎన్ఎస్పీ కాలనీ వేదికగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు సంయుక్తంగా పాల్గొని పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
కేంద్రం అందించే యూఐడీఎఫ్ అమృత్ 2.0 (AMRUT 2.0) నిధుల సహాయంతో ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా వినుకొండ పురపాలక పరిధిలోని విస్తరించిన అన్ని నివాస ప్రాంతాలకు కుళాయిల ద్వారా పరిశుభ్రమైన తాగునీటి సరఫరా వ్యవస్థను పునర్నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పట్టణ ప్రాంతాల రూపురేఖలు మార్చడానికి, పట్టణాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ఇటీవల కేబినెట్ భేటీలో ఏకంగా రూ. 5,000 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. తాగునీరు, డ్రైనేజీ, అంతర్గత రహదారుల విస్తరణ పనులకు త్వరలోనే కొత్త టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో కాంట్రాక్టర్లు ఈ తాగునీటి పథకం పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, పిఎం సూర్యఘర్ పథకం కింద వెనుకబడిన వర్గాల (బీసీ) గృహాలకు సోలార్ కనెక్షన్లు అందించేందుకు కేంద్రం ఇచ్చే రూ. 60 వేల సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 20 వేలు ఆర్థిక సాయం అందించనుందని వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి తాగునీరే ప్రధాన ఆధారమని, ఈ పనులను రాబోయే ఎన్నికల నాటికే పూర్తి చేసి ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని అధికారులకు, గుత్తేదారులకు సూచించారు. తాగునీటి వ్యవస్థ పునర్నిర్మాణంతో పట్టణంలో వందల కొద్దీ కుటుంబాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య రంగాల్లో కూటమి ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తోందనడానికి ఈ రూ. 239 కోట్ల ప్రాజెక్టే నిదర్శనమని స్థానిక ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో నీటి కొరత లేకుండా వినుకొండ పట్టణం స్వయం సమృద్ధి సాధిస్తుందని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ శంకుస్థాపన ఉత్సవంలో ప్రజారోగ్య శాఖ ఈఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ కే. నాగేశ్వరరావు, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Vinukonda Drinking Water Project, Gottipati Ravi Kumar, Amrut 2.0 AP, Palnadu District Development, TeluguOne News Urban Infrastructure


