వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి : సీఎం చంద్రబాబు
Published on: Mon Sep 14, 2026 12:40PM

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు పూజలు..!
వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో విఘ్నేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడిని పూజించడం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
.webp)
గణపతి జ్ఞానం, వివేకం, విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయమన్నారు. విఘ్నాలను తొలగించి సన్మార్గంలో నడిపించే వినాయక చవితి వేడుకలు సామాజిక స్పృహ, ఐక్యత, సమష్టితత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు.

సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ధార్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని సీఎం అన్నారు. వాడవాడలా ఏర్పాటు చేసే వినాయక మండపాలతో జరిగే చవితి వేడుకలు మరింత ప్రత్యేకమని పేర్కొన్నారు. ఇవి మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని తెలిపారు.

వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, రాష్ట్రాభివృద్ధికి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగిపోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, తెలుగు జాతి వర్ధిల్లాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
[ Vinayaka Chavithi, Ganesh Chaturthi, Chandrababu Naidu, AP CM Chandrababu, Andhra Pradesh, Vinayaka Puja, Ganapathi, Ganesh Festival, AP Development, Telugu Culture, Vinayaka Chavithi Wishes, Andhra Pradesh CM, TDP, Amaravati, AP Politics ]


