Village For Sale : ఏకంగా ఊరినే అమ్మకానికి పెట్టిన గ్రామస్తులు..అసలు కారణం ఏంటంటే.!
Published on: Tue Sep 29, 2026 2:51PM

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విచిత్రమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడి మాధా తహసీల్ పరిధిలోని తుల్షి గ్రామంలో సుమారు 7 వేల మంది జనాభా నివసిస్తున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ కరువు కోరల్లో చిక్కుకున్న గ్రామస్తులు ప్రభుత్వ కళ్లు తెపించేందుకు ఒక వినూత్నమైన, దిగ్భ్రాంతికరమైన నిరసన మార్గాన్ని ఎంచుకున్నారు. "విలేజ్ ఫర్ సేల్.. ధర: నీరు" అంటూ ఏకంగా గ్రామాన్ని అమ్మకానికి పెడుతున్నట్లు భారీ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ ఊరిని ఎవరు కొనాలనుకున్నా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, కేవలం తమకు తాగునీరు అందిస్తే చాలని వారు వినూత్నంగా నిరసన తెలిపారు.

ఈ తీవ్రమైన తాగునీటి సమస్య కారణంగా ఆ గ్రామ యువకుల వ్యక్తిగత జీవితాలు కూడా ఛిన్నాభిన్నమవుతున్నాయి. గ్రామంలో తీవ్రమైన నీటి కొరత ఉండటంతో, తమ కుమార్తెలనిచ్చి వివాహం చేసేందుకు ఏ కుటుంబం ముందుకు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తుల్షి గ్రామంలో సుమారు 350 మంది యువకులకు పెళ్లిళ్లు కావట్లేదని సర్పంచ్ శరద్ మోర్తో సహా గ్రామస్తులు వాపోతున్నారు. వ్యవసాయం, పశుపోషణ పూర్తిగా దెబ్బతిని ఉపాధి కోల్పోతున్నామని, నిత్యం నీటి ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉన్న మొత్తం 14 చెరువులు, బావులు పూర్తిగా ఎండిపోయి ఎక్కడా చుక్క నీరు కూడా దొరకని దుస్థితి నెలకొంది.
ఈ తీవ్ర సంక్షోభం వెనుక దశాబ్దాల నిర్లక్ష్యం దాగి ఉంది. సినా-మాధా ఎత్తిపోతల నీటిపారుదల పథకానికి సంబంధించి దాదాపు 800 మీటర్ల మేర తవ్వకం పనులు గత 26 సంవత్సరాలుగా అసంపూర్తిగానే నిలిచిపోయాయి. కాల్వలు గ్రామానికి సమీపంలోనే వెళ్తున్నప్పటికీ, సరైన పనులు పూర్తికాకపోవడంతో తుల్షి గ్రామస్తులకు ఒక్క చుక్క నీరు కూడా అందడం లేదు. ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులు కేవలం కాగితాలకే పరిమితం కావడంతో, గత సెప్టెంబర్ 14 నుంచి గ్రామస్తులు నిరాహార దీక్షలు చేపట్టి, మాధా తహసీల్ కార్యాలయం ఎదుట వంట పాత్రలు మ్రోగిస్తూ 'థాలి-నాద్' నిరసన చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి తమ దాహార్తిని తీర్చాలని, లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.
[ Village for sale, Tulshi village Solapur, Maharashtra water crisis, Sina Madha lift irrigation, water scarcity protest, India village news, Village for sale, Telugu One, Telugu News ]


