TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మైసూరును తలదన్నేలా విజయవాడ ఉత్సవ్: సంయుక్తంగా దసరా వేడుకలు, సరస్ మేళా.!

Published on: Sat Oct 3, 2026 11:10AM

బెజవాడలోని ఇంద్రకీలాదిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో  దసరా శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతాయి. వాస్తవంగా చెప్పాలంటే.. బెజవాడ కనకదుర్గమ్మ వేడుకలు మైసూరులో జరిగే శరన్నవరాతరి ఉత్సవాలకు ఏ మాత్రం తీసిపోవు. ఈ దసరావేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.  

ఇందులో భాగంగా బెజవాడలో అక్టోబర్ 11 నుంచి పది రోజుల పాటు అత్యంత వైభవంగా  విజయవాడ ఉత్సవ్ 2.0' నిర్వహించనున్నారు. ఆ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. దసరా ఉత్సవాలతో పాటు ప్రతిష్టాత్మకమైన జాతీయ  సరస్ మేళాను కూడా  నిర్వహించాలని నిర్ణయించారు. బెజవాడ జనంతో పాటు  రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది సందర్శకులను ఆకట్టుకునే రీతిలో ఈ వేడుకలను తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

దసరా పండుగ శోభను ఇనుమడింప చేసేలా  ఈ  వేడుకలు అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20 వరకు నిర్వహించనున్నారు. స్థానిక ఆర్థిక వ్యవస్థకు, పర్యాటకరంగానికి  ఊతమిచ్చేలా ఈ కార్యాక్రమాన్ని   రూపొందించారు. కేవలం పండుగ ఆచారాలకే పరిమితం కాకుండా, విజయవాడ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవాన్ని  జాతీయ,  అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ ఉత్సవ్-2.0కు రూపకల్పన చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నగరవాసులను ఎంతగానో అలరించనున్నాయి.

 దేశవ్యాప్తంగా ఉన్న హస్తకళాకారులు, స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులను ప్రదర్శన, విక్రయాలకు వేదికగా జాతీయ సరస్ మేళా కూడా దసరా ఉత్సవాలకు తోడు కావడంతో దసరా వేడుకలకు అదనపు హంగు, శోభ చేకూరనుందనడంలో సందేహం లేదు.  వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు తమ ప్రత్యేక వస్తువులు, చేనేత వస్త్రాలు, సాంప్రదాయ కళాఖండాలను ఈ మేళాలో ప్రదర్శించనుండటంతో  స్థానికులకు దేశంలోని వివిధ ప్రాంతాల కళారూపాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించడమే కాకుండా, చేతివృత్తుల వారికి మంచి ఆర్థిక చేయూత దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ  వేడుకల ప్రారంభ ఏర్పాట్లలో భాగంగా పలువురు ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  కూటమి నాయకులు ఈ కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులను, విఐపీలను ఈ ఉత్సవాలకు ఆహ్వానించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. 

ఈ ఉత్సవాల సందర్భంగా  ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.  రవాణా పరంగా ఇబ్బందులు తెలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం బెజవాడ సుందరీకరణ పనులను వేగవంతం చేశారు.  భద్రత, వైద్య సేవలు వంటి  మౌలిక వసతుల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. 


[Vijayawada Utsav, National Saras Mela Vijayawada, Dasara Celebrations, Mysore Dasara, AP Tourism, Telugu One]