TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు సజీవదహనం.!

Published on: Mon Oct 12, 2026 7:40PM

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో నలుగురు సజీవదహనమయ్యారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ నున్న, పటమట బజార్‌కు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి కొమ్మారెడ్డి అరుణ, నంబూరుకు చెందిన తిగురు విజయతో పాటు మరో వ్యక్తి, చిన్నారి కలిసి నంబూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం తిరిగి వస్తుండగా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో.. కారులోని బ్యాటరీ పేలినట్లు సమాచారం. దీంతో భారీగా మంటలు చెలరేగి క్షణాల్లోనే వాహనం మొత్తం వ్యాపించాయి. కారులో చిక్కుకున్న నలుగురు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి మాత్రం మంటల నుంచి బయటపడగలిగాడు. అయితే, అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రమాద వార్త తెలియడంతో మృతుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

 

 

 

[ Vijayawada Road Accident, Vijayawada West Bypass Accident, Electric Car Fire, Electric Car Battery Blast, Four People Burnt Alive, NTR District Accident, Vijayawada Breaking News, EV Car Accident, Andhra Pradesh News, Vijayawada Fire Accident, Road Accident News, Namburu News, Nunna Vijayawada, Andhra Pradesh Breaking News, Electric Vehicle Safety ]