TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రూ.20 వాటర్ బాటిల్ చోరీ చేశాడని.. స్తంభానికి కట్టేసి కొట్టి చంపేశారు.!

Published on: Thu Oct 22, 2026 3:20PM

ఆకలి వేస్తే అన్నం పెట్టే విశాల హృదయం మనది.. దాహమేస్తే గుక్కెడు మంచినీళ్లు ఇవ్వడం మన సంస్కృతి. కానీ నేటి సమాజంలో మనుషుల ప్రాణాల కంటే విలువైన వస్తువులే ఎక్కువైపోతున్నాయా? క్షణికావేశం, అంతులేని క్రూరత్వం కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపింది. కేవలం ఇరవై రూపాయల విలువైన ఒక వాటర్‌ బాటిల్‌ దొంగిలించాడనే అనుమానంతో ముప్పై మూడేళ్ల యువకుడిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి, రెండు గంటల పాటు విచక్షణారహితంగా కొట్టి చంపిన ఉదంతం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. 

తెలంగాణలోని నల్గొండకు చెందిన మాస సాయికుమార్‌ (33) కొంతకాలంగా తన భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడితో కలిసి విజయవాడలో నివాసముంటున్నాడు. ఉపాధి కోసం కుటుంబానికి దూరంగా ఉంటున్న సాయికుమార్ జీవితంలో ఆ అమావాస్య నాటి తెల్లవారుజామున ఊహించని విషాదం ముంచుకొచ్చింది.ఈ నెల 19వ తేదీ తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో సాయికుమార్ విజయవాడలోని పటమట డొంకరోడ్డు ప్రాంతంలో ఉన్న ఒక పాన్‌షాపు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో తీవ్ర దాహంతో తాళం వేసి ఉన్న ఫ్రిజ్‌ నుంచి వాటర్ బాటిల్ తీసేందుకు ప్రయత్నించాడు.

 అటుగా వచ్చిన ఒక పాల వ్యాన్ డ్రైవర్ దీనిని గమనించి వెంటనే పాన్‌షాప్‌లో పనిచేసే రవిశంకర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆ తర్వాత ఆ డ్రైవర్ సాయికుమార్‌ను రవిశంకర్‌కు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడికి చేరుకున్న రవిశంకర్ ఎలాంటి విచారణ లేకుండా సాయికుమార్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అతడిని ఈడ్చుకుంటూ వెళ్లి సమీపంలోని మద్యం దుకాణం వెనుక ఉన్న సందులోకి తీసుకెళ్లాడు. అక్కడ  బార్‌లో పనిచేసే అయ్యప్ప శంకర్ కూడా వారితో చేరడంతో ఇద్దరూ కలిసి సాయికుమార్ చేతులను వెనక్కి విరిచి విద్యుత్‌ స్తంభానికి గట్టిగా కట్టేశారు.

ఆ తర్వాత అటుగా వెళ్తున్న పోతంశెట్టి నవీన్, సాయి ప్రణీత్ అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఆ నలుగురితో జతకలిశారు. నలుగురు నిందితులు కలిసి కర్రలతో సాయికుమార్‌పై తీవ్రమైన దాడికి పాల్పడ్డారు. దెబ్బల వల్ల కలిగే నరకయాతనతో విలవిలలాడిపోయిన సాయికుమార్, "దయచేసి నన్ను కొట్టకండి.. నాకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు, నన్ను వదిలేయండి" అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ ఆ రాక్షసుల మనసులు కరగలేదు. ఏమాత్రం కనికరం లేకుండా సుమారు రెండు గంటల పాటు అతడిని కర్రలతో పదే పదే కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. 

ఈ విపరీతమైన దాడి కారణంగా సాయికుమార్ తీవ్ర గాలాలతో స్పృహ కోల్పోయి నేలకొరిగారు. అతడు చలనం లేకుండా పడిపోవడాన్ని గమనించిన ఆ నలుగురు నిందితులు భయపడి అక్కడి నుంచి పరారయ్యారు.ఉదయం 6 గంటల సమయంలో అటుగా వెళ్లిన స్థానికులు, సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న నాగేశ్వరరావుకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. రక్తపు గాయాలతో ప్రాణం కోల్పోయి పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. 

సమాచారం అందుకున్న పటమట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) పవన్ కిషోర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ (CCTV) పుటేజీలను పరిశీలించి జరిగిన ఘోరాన్ని నిర్ధారించారు. మృతుడు సాయికుమార్‌గా గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. కేవలం ఒక నీళ్ల బాటిల్ కోసం నలుగురు కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

 

 

 

[ Vijayawada murder, water bottle theft case, Patamata crime news, Sai Kumar death, AP crime updates, Vijayawada news today, CM Chandrababu, Home minister Anitha, Naralokesh ,AP Police ]