మహాలక్ష్మి అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ: భక్త జనసంద్రంగా ఇంద్రకీలాద్రి.!
Published on: Sat Oct 17, 2026 11:00AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి భక్తజనసంద్రంగా మారింది.

శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు భక్తులకు దివ్య రూపంలో దర్శనమిస్తూ విశేష పూజలందుకుంటున్నారు.బెజవాడ దుర్గమ్మ శనివారం (అక్టోబర్ 17) భక్తులకు మహాలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. సర్వమంగళకారిణిగా, ఐశ్వర్య ప్రదాయినిగా భావించే మహాలక్ష్మి రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. అమ్మవారి దివ్యరూపాన్ని తిలకించి తరించడానికి భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.

ఉత్సవాల నిర్వాహణలో ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆలయ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్ల నిర్వహణను మెరుగుపరిచారు. తాగునీరు, అల్పాహారం వంటి సౌకర్యాలతో పాటు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించారు.
బెజవాడ వాసులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తుల తాకిడితో బెజవాడ నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి ప్రాంగణం మార్మోగుతోంది.
[Vijayawada Dasara Celebrations, Kanaka Durga Temple, Indrakeeladri Navaratrulu, Mahalakshmi Alankaram, AP Festival, Telugu One]


