TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెజవాడ దసరా ఉత్సవాలకు సీఎం విజయ్: ఆహ్వానానికి సానుకూల స్పందన.!

Published on: Wed Oct 7, 2026 3:47PM

విజయవాడలో జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. విజయవాడ ఉత్సవ ప్రతినిధి బృందం చెన్నైలోని తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయంలో విజయ్‌ను కలిసి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఈ ఆహ్వానంపై సీఎం విజయ్ సానుకూలంగా స్పందించారు.  విజయ్‌ను కలిసి ఆహ్వానించిన ప్రతినిధి బృందంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. విజయవాడలో జరగనున్న దసరా శరన్నవరాత్రి వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవ్-2.0 కార్యక్రమాల గురించి కూడా వారు తమిళనాడు సీఎంకు వివరించారు. 

  మైసూరు దసరా ఉత్సవాలకు దీటుగా బెజవాడ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు విజయ్ కు తెలిపిన ప్రతినిథి బృందంఈ  వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవ వైభవాన్ని వీక్షించాలని  కోరారు. ఈ సందర్భంగా విజయవాడ నగరానికి ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని కూడా వారు ఆయనకు వివరించారు. 

అదలా ఉంటే.. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ఏడాది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ దర్శనం, క్యూలైన్లు, హోల్డింగ్ ఏరియాలు, అన్నప్రసాదం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

దసరా వేడుకలతో పాటు విజయవాడ ఉత్సవ్-2.0ను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరిగే ఈ పది రోజుల ఉత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళలు, భక్తి కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, కార్నివాల్, ఎగ్జిబిషన్లు, క్రీడా కార్యక్రమాలు తదితరాలు ఉండనున్నాయి. విజయవాడ దసరా, విజయవాడ ఉత్సవ్-2.0కు జాతీయ స్థాయిలో ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమం కొనసాగుతోంది. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులను కూడా కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది విజయవాడ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది.

[Vijayawada Dasara Celebrations, Invitation CM Vijay, Tamil Nadu CM Vijay, Vijayawada Sharannavaratri Celebrations, Vijayawada Utsav, Kesineni Chinni, Lavu Sri Krishna Devarayalu, Magunta Srinivasulu,Telugu One]