విజయవాడ బుక్ ఫెస్టివల్‌కు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.!
Published on: Tue Nov 24, 2026 8:52PM

విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. 2027 జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించనున్న 37వ పుస్తక మహోత్సవానికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. జనవరి 1న సాయంత్రం 5 గంటలకు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు.
గత 36 ఏళ్లుగా విజయవాడలో పుస్తక మహోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడంతో పాటు విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాహిత్య సమావేశాలు, పుస్తక ప్రియుల పాదయాత్ర వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గతంలో చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు, రచయితలు, సాహితీవేత్తలు ఈ మహోత్సవాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు.
గతంలో పీడబ్ల్యూడీ మైదానం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానాల్లో పుస్తక మహోత్సవాలను నిర్వహించామని తెలిపారు. గత రెండు పుస్తక మహోత్సవాలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా నిలిచిందని, ఈసారి కూడా అదే ప్రాంగణాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఏర్పాట్ల కోసం డిసెంబర్ 22 నుంచి 2027 జనవరి 16 వరకు స్టేడియంను అందుబాటులో ఉంచాలని వినతిపత్రం సమర్పించారు.
ప్రజల్లో పుస్తక పఠనాభిరుచిని పెంపొందించే లక్ష్యంతో విజయవాడలో రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ లైబ్రరీని కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈసారి పుస్తక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, వివిధ ప్రభుత్వ శాఖలు గతంలో మాదిరిగానే సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు టి. మనోహర్ నాయుడు, ఉపాధ్యక్షురాలు జి. లక్ష్మి, కార్యదర్శి కె. లక్ష్మయ్య, ప్రింటర్స్ అండ్ పబ్లిషర్స్ అసోసియేషన్ కార్యదర్శి కాట్రగడ్డ మోహన్ పాల్గొన్నారు.
ఇది కూడ చదవండి: బీసీలకు రాజ్యాధికారం.. హైదరాబాద్‌పై గురి.. తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
[ Vijayawada Book Festival, 37th Book Festival, CM Chandrababu Naidu, Andhra Pradesh, Amaravati, Indira Gandhi Municipal Stadium, Book Fair 2027, January 1 2027, Vijayawada Book Festival Society ]


