TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయసాయి కొత్త పార్టీ: వైసీపీ బీ టీమ్ అంటూ చర్చలు.!

Published on: Fri Nov 13, 2026 2:00PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోనూ, జనబాహుల్యంలోనూ కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పీఆర్పీ( పరివర్తన రాజనీతి పార్టీ)పై హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.  రంగంలో నిత్యం ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటూనే ఉంటుంది. గతంలో వైసీపీ లో నంబర్ 2 చక్రం తిప్పిన విజయసాయి, 2924 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. 

బయటకు వస్తూ తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి ఎక్కువ కాలం ఆ ప్రకటనకు కట్టుబడి ఉండలేదు. అప్పట్లో వ్యవసాయమే వ్యాపకమన్న విజయసాయి, ఇప్పుడు రాజకీయాలే తన వృత్తి అంటున్నారు. తాజాగా ఈ నెల 11న ఆయన పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించారు. గతంలో వైసీపీలో  కీలక నేతగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి రాజకీయ ప్రయాణానికి సంబంధించిన విశ్లేషణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, ఆయన గత ప్రయాణం,  ఆర్థిక, వ్యాపార రంగాలకు సంబంధించిన అంశాలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. 

చార్టర్డ్ అకౌంటెంట్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన విజయసాయి రెడ్డి..  ఆ తర్వాత కాలంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఏర్పడిన సాన్నిహిత్యంతో రాజకీయాలలోకి  ప్రవేశించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న విజయసాయి,   జగన్ సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత ఆయన నాయకత్వంలో ఆయనతో అడుగు కలిపి కదిలారు. వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కూడా జగన్ కు చేదోడువాదోడుగా  ఉన్న విజయసాయి, ఆ పార్టీలో నంబర్ 2 స్థాయికి ఎదిగారు.

2014 ఎన్నికలలోనూ, ఆ తరువాత 2019 ఎన్నికలలోనూ కూడా విజయసాయిరెడ్డే జగన్ వెనకుండి రాజకీయ వ్యూహరచన చేశారు. 2014లో వైసీపీ పరాజయం తరువాత, తిరిగ 2019లో అనూహ్యంగా పుంజుకుని ఘన విజయం సాధించడంలో విజయసాయి పాత్ర కిలకం అనడంలో సందేహం లేదు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కారణాలేమైతేనేం.. క్రమంగా వైసీపీలో విజయసాయి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. జగన్ వద్ద ఆయన ప్రతిష్ఠ దిగజారుతూ వచ్చింది. చివరకు 2024లో పార్టీ ఘోర పరాజయం తరువాత విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఆ సందర్భంగా ఆయన ప్రత్యక్షంగా జగన్ కోటరీపైనా, పరోక్షంగా జగన్ పైనా విమర్శలు గుప్పించారు. 

ఇది కూడా చదవండి:  విజయసాయి కొత్త పార్టీ: వైసీపీకి జరిగే నష్ట మేంటి.. రాష్ట్ర రాజకీయాల్లో పీఆర్పీ ప్రభావమెంత.?

అది పక్కన పెడితే..జగన్ కు సన్నిహితంగా మెలిగి, అప్పట్లో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం, అనుసరించిన విధానాలలో విజయసాయి భాగస్వామి అనడంలో సందేహం లేదు. అటువంటి విజయసాయి ఇప్పుడు తగుదునమ్మా అని రాజకీయాలలో పరివర్తన, నాయకులలో నిజాయితీ గురించి ప్రసంగాలు గుప్పించడం హాస్యాస్పదంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీలో ఉన్నంత కాలం కనిపించని తప్పులు, ఇప్పుడు సొంత రాజకీయ ప్రకటన పెట్టగానే కనిపిస్తున్నాయా అని నిలదీస్తున్నారు. 

మాజీ మంత్రి వివేకా హత్య కేసు విషయంలో కానీ, మద్యం కుంభకోణం విషయంలో కానీ వైసీపీలో ఉన్నంత కాలం జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని సమర్ధించిన విజయసాయి, ఇప్పుడు జగన్ పై విమర్శలు గుప్పించినంత మాత్రాన గతంలో తప్పుల నుంచి విముక్తి పొందలేదని అంటున్నారు. 
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, విజయాసి పరివర్తన రాజనీతి పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరైతే విజయసాయి పీఆర్పీ ని వైసీపీ బి టీమ్ గా అభివర్ణిస్తున్నారు.  భవిష్యత్తులో ఆయన అనుసరించే రాజకీయ వ్యూహాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతాయనేది వేచి చూడాలి.

మీకు నచ్చవచ్చు: విజయసాయి కొత్త పార్టీ పీఆర్ పీ: ఏపీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యమని ప్రకటన.!

వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి

[VijayaSaiReddy, ewparty, PRP, APPolitics,  APpolitics, TeluguOne]