TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిజమైన సీమ పౌరుషం ఏంటో చూపిస్తా.. మాజీ ఎంపీ విజయసాయి.!

Published on: Fri Sep 18, 2026 3:03PM

రాష్ట్ర రాజకీయాల్లో  రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన తాజా ప్రకటన  చర్చనీయాంశంగా మారింది. త్వరలో ఆవిర్భవించబోయే తన నూతన రాజకీయ వేదిక రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధికి, అక్కడి ప్రజల ఆత్మగౌరవానికి   ప్రతీకగా నిలుస్తుందన్నారు. అనంతపురంలో   మీడియా సమావేశంలో  మాట్లాడిన విజయసాయి.. ప్రాంతీయ రాజకీయాల సరళిపై, పాలకుల తీరుపై   విమర్శలు గుప్పించారు. సీమ ప్రాంత ప్రజల హక్కులను కాపాడే దిశగా తమ అడుగులు ఉంటాయని, రాబోయే రోజుల్లో అసలైన సీమ పౌరుషం ఎంటో చేతల్లో నిరూపిస్తామని హెచ్చరించారు. 

ఈ సందర్భంగా ఆయన  తెలుగుదేశం,వైసీపీల  నాయకత్వాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా..  రెడ్డి  కార్పొరేషన్‌ను ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని   నిలదీశారు. కేవలం ఎన్నికల వేళ మాత్రమే రాజకీయ లబ్ది కోసం సామాజిక వర్గాలను వాడుకోవడం తప్ప.. ఆచరణలో ఎలాంటి సంక్షేమ చర్యలు చేపట్టడం లేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అత్యున్నత అధికార పదవులను చేపట్టిన నేతలంతా రాయలసీమ ప్రాంతానికే చెందినవారైనప్పటికీ, ఈ ప్రాంత అభివృద్ధికి వారు చేసిందేమీ లేదని విమర్శించారు.

 చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాల కారణంగా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న విజయసాయిరెడ్డి ఈ రెండు కుటుంబాలు కలిసి కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా ఈ ప్రాంతంలో పూర్తి చేయలేకపోయాయని విమర్శించారు. ఎన్నికల సమయంలో   ఓట్ల కోసం మాత్రమే సీమ వైపు వచ్చే ఈ అగ్రనేతలు, ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో స్థిరపడి స్థానిక సమస్యలను గాలికొదిలేస్తున్నారని మండిపడ్డారు. దశాబ్దాలుగా పాలిస్తున్న పెద్దల నిర్లక్ష్యం వల్ల ఇక్కడి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతుండటం   బాధాకరమైన పరిణామంగా అభివర్ణించిన విజయసాయిరెడ్డి.. ఇకనైనా ఇక్కడి యువత కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, ప్రాంత భవిష్యత్తు కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీ విధానాల వల్ల రాయలసీమకు ఎప్పటికీ మేలు జరగదని, ప్రజలు ఈ  సత్యాన్ని గ్రహించాలని కోరారు. అన్ని కులాలు, మతాల ప్రజలను సమానంగా గౌరవిస్తూ, యువతను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని మళ్లీ పూర్వవైభవంతో  రతనాల సీమ'గా మారుస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.సీమ గడ్డపై పుట్టిన నాయకులు ఇక్కడి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన వైనాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు. రాబోయే కాలంలో జరగబోయే రాజకీయ పరిణామాలు ఈ ప్రాంతం రూపురేఖలను మారుస్తాయని, ప్రజల మద్దతుతో ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిని తెరపైకి తీసుకువస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

[Vijayasai Reddy, Rayalaseema Politics, Anantapur News, TDP YCP Criticism, Andhra Pradesh Political News, Telugu One]