27 ఏళ్ల సుదీర్ఘ ప్రయత్నం: 59 ఏళ్ల వయసులో సర్కార్ టీచర్ ఉద్యోగం.!
Published on: Fri Sep 25, 2026 6:39PM

పట్టుదల, సంకల్పం ఉంటే ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి నిరూపించారు. సుమారు రెండున్నర దశాబ్దాలకుపైగా సాగిన నిరంతర పోరాటం తర్వాత, ఆయన తన 59వ ఏట ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పదవీ విరమణ సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆయన కల నెరవేరడం విశేషం.
ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్ జిల్లా బడ్రవాడ్ గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శర్మ సుదీర్ఘకాలంగా ప్రభుత్వ ఉపాధ్యాయ కొలువు కోసం తీవ్రంగా శ్రమించారు. 1999 నుంచి ఆయన ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సుదీర్ఘ కాలంలో అనేకసార్లు రాతపరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, చివరి దశలో నిరాశే ఎదురైంది.
గత 27 ఏళ్ల కాలంలో ఆయన ఆరుసార్లు టీజీటీ (Trained Graduate Teacher), నాలుగుసార్లు పీజీటీ (Post Graduate Teacher) రాతపరీక్షల్లో సత్తా చాటారు. రాత పరీక్షలను విజయవంతంగా దాటినప్పటికీ, దాదాపు ఎనిమిది సార్లు ఇంటర్వ్యూ దశలో వెనుకంజ వేయాల్సి వచ్చింది. దీంతో ఆయన ఎన్నోసార్లు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు.అయితే ఈసారి నియామక ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయడంతో, కేవలం రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసింది. ఈ నిర్ణయమే విజయ్ కుమార్ శర్మ జీవితంలో సరికొత్త మలుపు తిప్పింది.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎక్కడా నిరుత్సాహపడలేదు. కుటుంబ పోషణ నిమిత్తం ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే, తన లక్ష్య సాధన కోసం రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టారు. ఆయన కుటుంబసభ్యులు అందించిన నైతిక మద్దతు ఈ పోరాటంలో కొండంత బలాన్నిచ్చింది. ఇటీవల లక్నోలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా విజయ్ కుమార్ శర్మకు నియామక పత్రాన్ని అందజేశారు. షామ్లీ జిల్లాలోని ఒక ఎయిడెడ్ సెకండరీ పాఠశాలలో ఆయన సంస్కృతం ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. ఆయన తండ్రి కూడా గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేయడం గమనార్హం.
ప్రస్తుతం ఆయన వయసు 59 సంవత్సరాల ఎనిమిది నెలలు కాగా, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లుగా ఉంది. దీనివల్ల ఆయన మరో రెండేళ్లకు పైగా మాత్రమే విధులను నిర్వర్తించనున్నారు. అయినప్పటికీ, తన జీవితాశయం నెరవేరడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ఈ ఘటన నిరుద్యోగుల్లోనూ, వయసుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించాలనుకునే వారిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఎంత కాలం పట్టినప్పటికీ నిజమైన కృషితో పాటు పట్టుదల ఉంటే విజయం ఎప్పటికైనా సొంతం అవుతుందని విజయ్ కుమార్ శర్మ ప్రయాణం భావితరాలకు ఒక గొప్ప పాఠంగా నిలుస్తోంది.
[ Vijay Kumar Sharma teacher job, 59 years old government teacher UP, Yogi Adityanath appointment letter,27 years struggle for government job, Uttar Pradesh teacher recruitment success, UP TGT PGT Recruitment, Telugu One, Telugu News ]


