TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముంచుకొస్తున్న పెను తుపాను: అర్నాబ్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు.!

Published on: Mon Oct 26, 2026 9:18AM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుపానుగా, తీవర తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.  అర్నబ్ గా పిలవబడుతున్న ఈ తీవ్ర తుపాను బుధవారం (అక్టోబర్ 28) బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.  తీరం దాటే సమయంలో గంటకు140 కీలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.   అక్టోబర్ 27, 28 తేదీల్లో కోస్తాంధ్రలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.   

ప్రధానంగా ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది.   విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల  జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  ఇప్పటికే సముద్రంలో ఉన్న పడవలు సురక్షితంగా తీరానికి చేరేలా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.  బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, పాడుబడిన భవనాలకు దూరంగా ఉండాలని సూచించారు.  

తీవ్ర తుపాను నేపథ్యంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యలు, పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు, విద్యుత్ పునరుద్ధరణ వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలను సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉంచారు. 

అర్నబ్ తుపాను ప్రభావాన్ని ఎదుర్కొని సాధ్యమైనంత తక్కువ నష్టంతో బయటపడేందుకు అవసరమైన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.  24 గంటల పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలను అత్యవసర సేవల కోసం రంగంలోకి దించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్, రవాణా,  వైద్య శాఖలను సమన్వయం చేస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తగిన  చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఇప్పిటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.  

తుపాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం, కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగడం ముప్పు ఉందనీ. అలాగే భారీ నుంచి అత్యంత భారీ వర్షాల కారణంగా  లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే  అవకాశం ఉందనీ హెచ్చరించిన అధికారులు   అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పేర్కొన్నారు.  తుపాను తీరం దాటిన తరువాత కూడా  కోస్తాంధ్ర జిల్లాలలో మరో రెండు రోజుల పాటుభారీ  వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

[Very Heavy Rains Costal Andhr, Cyclone Arnab, Andhra Pradesh weather, IMD Cyclone Warning, Bapatla Visakhapatnam landfall, Telugu One]