TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వర్థమాన్ జైన్ ఎవరో తెలుసా: తిరుమలేశునికి 121 కిలోల బంగారం విరాళం ప్రకటించిన దాత.!

Published on: Thu Nov 26, 2026 10:53AM

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించిన భక్తుడు ఎవరనే అంశంపై కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. ఆ భారీ కానుకను సమర్పించిన దాత చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అని స్పష్టమైంది. భారీ స్థాయిలో బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించేందుకు ముందుకు వచ్చిన ఆ భక్తుడి వివరాలు తెలుసుకునేందుకు భక్తజనం, సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిన నేపథ్యంలో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.   

చెన్నై నగరానికి చెందిన వర్ధమాన్ జైన్ తిరుమల తిరుపతి దేవస్థానం   ఈవో ని కలిసి, తాను సమర్పిస్తున్న బంగారు ఆభరణాలకు సంబంధించిన అధికారిక పత్రాలను అందజేశారు. ఆభరణాల అప్పగింతకు సంబంధించిన నిబంధనలు, ధృవీకరణ ప్రక్రియలో భాగంగా ఈ డాక్యుమెంట్లను ఈవోకు సమర్పించారు.   ఈ భారీ విరాళం వెనుక ఉన్న ఆర్థిక నేపథ్యం విషయానికి వస్తే.. వర్ధమాన్ జైన్ తాను స్థాపించి నిర్వహించిన కంపెనీలో 60 శాతం వాటాను విక్రయించారు. ఆ వాటా విక్రయం ద్వారా ఆయనకు   6 వేల కోట్ల వరకు ఆదాయం లభించింది. తన వ్యాపార విజయానికి, ఆర్థిక లాభానికి శ్రీవారి అనుగ్రహమే కారణమన్న విశ్వాసంతో, ఆ మొత్తంలో నుంచి 121 కిలోల బంగారాన్ని స్వామివారికి కానుకగా ఇస్తున్నట్లు   తెలియజేశారు.   

తిరుమల శ్రీవారికి నిత్యం అలంకరించే ఆభరణాల బరువు సుమారు 120 కిలోల వరకు ఉంటుందన్న నేపథ్యంలో, దానికి సమానంగా 121 కిలోల బంగారు ఆభరణాలను సమర్పించాలని వర్థమాన్ జైన్ భావించారు.  వివిధ రకాల బంగారు ఆభరణాలతో కూడిన ఈ కానుక విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

తిరుమల ఆలయ చరిత్రలో   భారీ వ్యక్తిగత బంగారు విరాళాల్లో ఇది ముందువరుసలో ఉంటుందని భావిస్తున్నారు. గతంలో దాత పేరును గోప్యంగా ఉంచడంతో, ఆ అజ్ఞాత భక్తుడు ఎవరనే దానిపై భక్తుల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఇప్పుడు దాత పేరు, నేపథ్యం, ఈవోకు పత్రాలు అందజేసిన అంశం బయటకు   వచ్చింది.   మరోవైపు వర్ధమాన్ జైన్ గతంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వివిధ ట్రస్టులకు విరాళాలు అందించిన నేపథ్యం ఉంది. 

ఇది కూడా చదవండి:  శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం: ఓ భక్తుడి వితరణ: ఎప్పుడంటే.?

శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తితో ఆయన ఈ భారీ బంగారు ఆభరణాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టారు.అధికారిక పత్రాల అందజేత ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, టీటీడీ నిబంధనల ప్రకారం ఆభరణాల తనిఖీ, నమోదు మరియు స్వామివారి సేవల్లో వినియోగించే ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. 

శ్రీవారి కైంకర్యాలకు ఈ ఆభరణాలను త్వరలోనే వినియోగించనున్నారు.తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు ఆలయ సంప్రదాయాలు, నియమాలకు అనుగుణంగా ఉండటంతో.. ఇంతటి భారీ విరాళం అందించిన దాత సేవాభావంపై భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వామివారి అలంకరణలో ఈ నూతన బంగారు ఆభరణాలు ప్రత్యేక శోభను తీసుకురానున్నాయని భక్తులు ఆశిస్తున్నారు.

మీకు నచ్చవచ్చు:  టీటీడీ శ్రీవారి సురక్ష పథకం: తిరుమల శ్రీవారి భక్తులకు బీమా.!

తిరుమలేశునికి రూ.160 కోట్ల బంగారు ఆభరణాలు: చంద్రబాబు సమక్షంలో సమర్పించనున్న అజ్ణాత భక్తుడు.!

[Vardhaman Jain, Donar, 121kg gold donated, TirumalaGod, TTD, Teluguone]