జనసేన గూటికి వంగవీటి రాధాకృష్ణ: విజయవాడ మేయర్ పీఠంపై కన్ను.!
Published on: Wed Oct 14, 2026 9:03AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామానికి విజయవాడ వేదిక కానుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన బుధవారం (అక్టోబర్ 14) జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవల వంగవీటి రాధా.. పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీల తర్వాత ఆయన పార్టీ మార్పుపై ప్రచారం జోరందుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా వంగవీటి రాధా పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, విజయవాడ మేయర్ పీఠం అన్రిజర్వ్డ్ జనరల్‌గా కేటాయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంటోందని అంటున్నారు.

తెలుగుదేశంకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా విజయవాడ మేయర్ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉండటంతో.. ఆ పార్టీ తరఫున వంగవీటి రాధా లేదా ఆయన భార్య పుష్పవల్లిని బరిలోకి దింపాలని తెలుగుదేశం, జనసేనలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వంగవీటి కుటుంబానికి విజయవాడలో ఉన్న బలమైన అనుచరగణం, చారిత్రక నేపథ్యం ఈ నిర్ణయానికి కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే, ఇదే సీటుపై టీడీపీ నుంచి కూడా బోండా ఉమా కుమారుడు రవితేజ, మరి కొందరు కూడా ఆసక్తికనబరుస్తుండటంతో వంగవీటి రాధ జనసేన చేరిక ఉత్కంఠ రేపుతోంది. రాజకీయంగా ఈ పరిణామంతో సమీకరణాలు ఎలా మారుతాయన్న ఆసక్తి నెలకొంది.
అదలా ఉంటే.. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
[Vangaveeti Radha Joining Janasena, Vangaveeti Radhakrishna, Pawan Kalyan, Vijayawada Mayor Elections, TDP Janasena Alliance, Andhra Pradesh Politics, Telugu One]


