TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేషనల్ కాన్ఫరెన్స్ గౌరవం.. కాంగ్రెస్ అభ్యంతరం.. వందేమాతరం వివాదం వెనుక రాజకీయం.!

Published on: Sat Sep 12, 2026 3:34PM

జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికపై వందేమాతరం  పూర్తి పాఠాన్ని ఆలపించినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా లేచి నిలబడి గౌరవం తెలపడం దేశ రాజకీయాల్లో   చర్చనీయాంశమైంది. అయితే మిత్రపక్షాలైన ఈ నేతల తీరుపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ బహిరంగంగానే అభ్యంతరం వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పందిస్తూ.. జాతీయ ఉద్యమ కాలం నుంచి పార్టీ పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం వందేమాతరం లో కేవలం మొదటి రెండు చరరణాలను మాత్రమే అధికారిక వేదికలపై ఆలపించాలని, పూర్తి ఆరు చరణాలు ఆలపించడం సామరస్య బావనకు  భావనకు సరిపడదని వాదిస్తున్నాయి. కానీ ఈ వాదనను నేషనల్ కాన్ఫరెన్స్ ఖండించింది. పార్లమెంట్ ఆమోదించిన నిబంధనలు,  ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం అధికారిక కార్యక్రమాలలో జాతీయ గేయం పూర్తి రూపాన్ని ప్రసారం చేయడం చట్టపరమైన బాధ్యత అని  స్పష్టం చేసింది.  

ఈ వివాదం వెనుక దాదాపు తొమ్మిది దశాబ్దాల చరిత్ర ముడిపడి ఉంది. బెంగాలీ రచయిత బంకిం చంద్ర ఛటోపాధ్యాయ  1875లో రచించిన ఈ గీతం, ఆ తర్వాత ఆయన ప్రసిద్ధ నవల  ఆనందమఠ్ లో భాగమైంది. ఈ గీతంలో మొత్తం ఆరు చరణాలు ఉండగా, తొలి రెండు చరణాలు మాతృభూ నైసర్గిక సౌందర్యాన్ని, నదులు, పంటల సమృద్ధిని వర్ణిస్తాయి. ఆ తర్వాతి నాలుగు చరణాలలో హిందూ దేవతల ప్రస్తావనలు ఉండటంతో, నాటి రాజకీయ పరిణామాల మధ్య వందేమాతరం చుట్టూ వివాదాలు తలెత్తాయి.  చారిత్రక పరిణామాలను పరిశీలిస్తే, 1937లో ముస్లిం లీగ్ అగ్రనేత ముహమ్మద్ అలీ జిన్నా ఈ గీతానికి వ్యతిరేకంగా గళం విప్పారు.

ఆ సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులు రవీంద్రనాథ్ టాగోర్‌ను సంప్రదించగా, ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ సమావేశాలలో కేవలం మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలని టాగోర్ సలహా ఇచ్చారు. దీనికి అనుగుణంగానే 1937 అక్టోబర్‌లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తొలి రెండు చరణాలకే పరిమితం కావాలనే తీర్మానాన్ని ఆమోదించారు.  కాలక్రమేణా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 2026 లో పార్లమెంట్ ఉభయసభలు నేషనల్ హానర్ అపరాధాల నివారణ సవరణ చట్టాన్ని ఆమోదించి, వందేమాతరానికి జనగణమనతో సమానమైన చట్టబద్ధతను కల్పించాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా ప్రభుత్వ కార్యక్రమాలలో పూర్తి ఆరు చరణాలను ప్రసారం చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. 

అయినప్పటికీ, కాంగ్రెస్మాత్రం ఇప్పటికీ తన పాత వైఖరినే కొనసాగిస్తూ పార్టీ కార్యక్రమాలలో తొలి చరణాలకే పరిమితమౌతోంది.  ప్రభుత్వ ప్రోటోకాల్‌కు అనుగుణంగా కాశ్మీర్ ముస్లిం నాయకులు వందేమాతరం ఆలాపన సమయంలో పూర్తి ఆరు చరణాలూ పూర్తయ్యేవరకూ  నిలబడి గౌరవిస్తే.. జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్   దీనిని వ్యతిరేకించడం పట్ల  భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇండియా  కూటమిలోని ఇతర పక్షాలు కూడా ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరితో పూర్తిగా ఏకీభవించకపోవడంతో కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. జాతీయ గౌరవం, చట్టబద్ధమైన ప్రోటోకాల్,  రాజకీయ వ్యూహాల మధ్య నలుగుతున్న ఈ అంశం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.  

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.    

[Vande Mataram controversy, Omar Abdullah, Congress Party, National Anthem Act, National Conference, Telugu One]