TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జాతీయ గేయం ఆలాపనపై పిల్: విచారణకు స్వీకరించిన సుప్రీం.. కేంద్రానికి నోటీసులు.!

Published on: Wed Sep 23, 2026 4:20PM

జాతీయ గేయం వందేమాతరం పూర్తి చరణాల ఆలపించడం,  దానిని వ్యతిరేకించడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తాజాగా ఈ అంశంపై కీలక ప్రకటన వెలువరించింది. జాతీయ గేయాన్ని ఆలపించడానికి నిరాకరిస్తే శిక్ష విధించే నిబంధనలపై న్యాయపరమైన సవాళ్లను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ పరిణామం జాతీయ స్థాయిలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 

సాధారణంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే   ఆలపిస్తుంటారు. అయితే, మొత్తం ఆరు చరణాలను తప్పనిసరి చేయాలనే డిమాండ్లు, నిబంధనలు వచ్చిన తర్వాత వివాదం రాజుకుంది. ఈ ఆరు చరణాలలో హిందూ దేవతలైన దుర్గ, లక్ష్మి, సరస్వతి ప్రస్తావనలు ఉన్నాయని, కొన్ని వర్గాలు తమ మత విశ్వాసాల ప్రకారం దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గేయం పూర్తి చరణాల అమలతో పాటు, పాడటానికి నిరాకరిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చా అనే అంశం న్యాయస్థానానికి చేరింది.

ప్రముఖ గాయకుడు టీఎం కృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. అయితే.. ప్రస్తుత దశలో జాతీయ గేయం రెండు చరణాలా లేక ఆరు చరణాలా అనే సాంకేతిక అంశాన్ని తాము పరిశీలించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ గేయాన్ని  పాడనంత మాత్రాన ఎవరినీ శిక్షించలేమని గతంలో ఇచ్చిన బిజోయ్ ఇమ్మాన్యుయేల్ తీర్పు సూత్రాలు ప్రస్తుతానికీ వర్తిస్తాయని కోర్టు స్పష్టం చేసింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కల్పించిన మత స్వేచ్ఛ హక్కుల పరిధిలో ఉంటూ, జాతీయ గేయం పాడకపోతే తలెత్తే పర్యవసానాలను పరిశీలించవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ వ్యాజ్యంపై తమ స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మరోవైపు..  కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ పిటిషన్‌ను  వ్యతిరేకించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన జాతీయ గేయాన్ని ప్రశ్నించడం సరికాదన్నారు.

గతంలో పార్లమెంటు ఉభయ సభలు జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం కింద వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ సవరణలు చేపట్టాయి. దీని ప్రకారం జాతీయ గేయానికి భంగం కలిపినా లేదా అంతరాయం సృష్టించినా కఠిన శిక్షలు ఉండే అవకాశం ఉంది. అయితే, భావప్రకటన స్వేచ్ఛ మరియు మత విశ్వాసాల కోణంలో ఈ చట్టపరమైన నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై రాబోయే రోజుల్లో న్యాయస్థానంలో వాదనలు మరింత జోరందుకునే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వివరణపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.


 [Vande Mataram, National Song,Supreme Court, TM Krishna, Tushar Meht, CJI, Telugu One]