వంశీ తెలుగుదేశం తలుపుతడుతున్నారా?

వల్లభనేని వంశి నోటి వెంట వచ్చే మాటలన్నీ పోలింగ్ కు ముందే తన ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. వల్లభనేని వంశీ 2019 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన తరువాత వైసీపీలోకి జంప్ చేశారు. అంతుకు ముందు ఎన్నికలలో అంటే 2014 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

అయితే పోలింగ్ వరకూ ఆగనవసరం లేకుండానే ఆయన తన మాటలతో చేతలతో ఓటమి ఖాయమైపోయిందన్న సంకేతాలిస్తున్నారు. ఇటీవల గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం నుంచి  పోటీ చేయడం ఇదే ఆఖరుసారి అని చెప్పారు. వచ్చే ఎన్నికలలో అంటే 2029లో దుట్టారామచంద్రరావు కుమార్తె పోటీ చేస్తారనీ, తాను ఆమెకు మద్దతు ఇస్తానని చెప్పారు. వైసీపీలో వంశీకి వర్గ పోరు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే.

గత రెండు ఎన్నికలలో వంశీ విజయానికి దోహదం చేసిన తెలుగుదేశం బలం ఇప్పుడు వంశీకి లేదు. ఇక వంశీకి వైసీపీ నుంచి కూడా తీవ్ర వర్గ పోరు ఎదురైంది. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా, తనకు ప్రత్యర్థిగా ఉన్న యార్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం గూటికి చేరి ఆ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయనతో పాటు ఆయన వర్గీయులంతా కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి దేశం గూటికి వచ్చేశారు. అయితే అందుకు భిన్నంగా వంశీ కోసం తెలుగుదేశం వీడేందుకు ఆయన వర్గీయులు సిద్ధపడలేదు. ఇదలా ఉంటే వైసీపీలో మరో బలమైన నేత  దుట్టా రామచంద్రరావు. ఆయన వంశీకి ఇసుమంతైనా సహకారం అందించడం లేదు. వంశీ విజయం కోసం పని చేసే ప్రశక్తే లేదని పలు సందర్భాలలో బాహాటంగా చెప్పారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో వంశీ కోసం పని చేసే వారే కరవయ్యారు. అందుకే ఆయన నామినేషన్ ర్యాలీ అంతంత మాత్రంగా సాగింది. డబ్బులిచ్చి తెచ్చుకున్నవారు కూడా చివరి వరకూ ర్యాలీలో నిలవలేదు. 

ఈ నేపథ్యంలోనే ర్యాలీ అనంతరం మీడియాతో మాట్లాడిన వంశీ దుట్టాను మంచి చేసుకోవడానికి ప్రయత్నించారు. వచ్చే ఎన్నికలలో అంటే 2029లో ఆమె కుమార్తె పోటీ చేస్తారనీ, ఆమెకు తన సంపూర్ణ సహకారం అందిస్తాననీ చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే తనను  ఈసారి గెలిపించమని దుట్టాను వంశీ బతిమలాడుకున్నారు. అదీ మీడియా ముఖంగా. అయితే అదేమంతా ఫలించినట్లు కనిపించలేదు. సరే అదలా ఉంచితే... తాజాగా వంశీ ఒక ప్రముఖ చానెల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన పూర్తిగా చేతులెత్తేశారు.  

ఇంత కాలం తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపైనా ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసిన వంశీ ఆ టీవీతో మాట్లాడుతూ చంద్రబాబుతో తనకు విభేదాలే లేవని చెప్పుకొచ్చారు. కేవలం జనరేషన్ గ్యాప్ మాత్రమేననీ, అదేమంత పెద్ద విషయం కాదనీ చెప్పుకున్నారు.  తానూ, కొడాలి నాని తెలుగుదేశం జిల్లా నాయకత్వంతోనూ, పార్టీ రెండో తరం నాయకత్వంతోనూ కలిసి ముందుకు సాగలేకపోయాం అటే పరోక్షంగా లోకేష్ తో  చిన్న చిన్న విభేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకున్నారు.  వంశీ మాటలను బట్టి ఆయన ఓటమి తప్పదన్న నిర్ణయానికి వచ్చేశారనీ, ఎన్నికల తరువాత మళ్లీ తెలుగుదేశం గూటికి చేరేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా కనిపిస్తోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.