వైభవ్ సూర్యవంశీ.. టీమ్ ఇండియా జట్టు సభ్యుడయ్యేదెప్పుడో తెలుసా?
Published on: Sat Feb 7, 2026 10:37AM
.webp)
వైభవ్ సూర్యవంశి.. ఈ పేరిప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. 14 ఏళ్ల కుర్రాడు.. ఇంకా నూనూగు మీసాలైనా రాని బాలుడు.. క్రికెట్ ప్రపంచంలో మేటి రికార్డులను బద్దలు కొట్టేశాడు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ లో కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు. ఆ పరుగులలో 150 పరుగులు కేవలం బౌండరీలు, సిక్సర్లతోనే వచ్చాయంటే సూర్యవంశి ఇంగ్లాండ్ యువ జట్టు బౌలర్లను ఏ రకంగా చీల్చి చెండాడాడో అర్ధమౌతుంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సహా క్రికెట్ దిగ్గజాలందరూ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వైభవ్ సూర్యవంశిని వెంటనే టీమ్ ఇండియా సీనియర్ టీమ్ లోకి తీసుకోవాలన్న డిమాండ్ క్రికెట్ అభిమనుల నుంచి బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఐపీఎల్ లో ప్రపంచ దిగ్గజ బౌలర్లను ఓ ఆటాడుకుని క్రికెట్ ప్రపంచాన్నే నివ్వెరపరిచిన వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియా సీనియర్ టీమ్ లోకి ఎంటర్ అవ్వడానికి అన్ని అర్హతలూ సంపాదించేశాడు.
అయితే వెంటనే అతడు సీనియర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎంత మాత్రం లేవు. ఎందుకంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల మేరకు అంతర్జాతీయ స్థాయి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే కనీపం 15 ఏళ్లు నిండి ఉండాలి. కానీ వైభవ్ సూర్యవంశీకి ప్రస్తుతం 14 ఏళ్లు. ఈ ఏడాది మార్చి 27న వైభవ్ సూర్యవంశీ తన 15వ పుట్టిన రోజు జరుపుకోనున్నాడు. ఆ తరువాత మాత్రమే వైభవ్ సూర్యవంశీకి టీమ్ ఇండియా సీనియర్ జట్టులోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది.
అప్పటి వరకూ సూర్యవంశి మెరుపులను దేశవాళీ క్రికెట్ లో మాత్రమే చూడగలం. ఇక వయస్సు పరంగా అవకాశం ఉన్నప్పటికీ వైభవ్ సూర్యవంశి మరోసారి అండర్ 19 వరల్డ్ కప్ లో ఆడే అవకాశం లేదు. 14 ఏళ్ల ఈ కుర్రాడు 2028, 2030 అండర్ 19 వరల్డ్ కప్ లో కూడా ఆడి అదరగొడతాడని అభిమానులు ఆశించారు. కానీ అలా ఆడడానికి వైభవ్ సూర్యవంశీకి అవకాశం లేకుండా పోయింది. ఇందుకు కూడా ఐసీసీ నిబంధనలే అడ్డుగా నిలిచాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం అండర్ 19 వరల్డ్ కప్ లొ ఒక క్రీడాకారుడు ఒకసారి మాత్రమే ఆడాల్సి ఉంటుంది.


