TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెరపైకి ఉత్తరప్రదేశ్ విభజన: నాలుగు రాష్ట్రాలుగా యూపీ.. డిమాండ్ వెనుక కథేంటంటే.?

Published on: Sun Sep 27, 2026 7:46AM

 దేశంలో  జనాభా పరంగా  పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ విభజన అంశం మరో సారి తెరమీదకు వచ్చింది.  దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీని నాలుగు భాగాలుగా విభజించాలనే డిమాండ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట  ఈ పాత డిమాండ్ మళ్లీ తెరపైకి రావడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.  

ఉత్తరప్రదేశ్‌ భవిష్యత్తులో పూర్వాంచల్, మధ్యాంచల్, బుందేల్‌ఖండ్, హరిత్ ప్రదేశ్‌లుగా మారుతుందని యూపీ కేబినెట్ మంత్రి, ఎన్‌డీఏ కూటమి భాగస్వామి అయిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్ పేర్కొన్నారు. ఒకవేళ ప్రత్యేక పూర్వాంచల్ రాష్ట్రం ఏర్పడితే, ఆ ప్రాంతంలో తమ వర్గానికి బలమైన ఓటు బ్యాంకు ఉన్నందున తొలి ముఖ్యమంత్రి తమ సామాజిక వర్గానికి చెందిన వారే అయి ఉండాలని ఆయన డిమాండ్ చేయడం ద్వారా భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై స్పష్టతనిచ్చారు.

అయితే ఈ నాలుగు రాష్ట్రాల ప్రతిపాదన ఇప్పటిది కాదు.. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది.    రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తన 1955లోనే తన థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్  పుస్తకంలో  యూపీని మూడు చిన్న రాష్ట్రాలుగా విభజించాలని స్పష్టంగా సూచించారు. ఆ తర్వాత కాలంలో 2011 నవంబర్‌లో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలో   తీర్మానాన్ని కూడా ఆమోదించింది.

పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ్ ప్రదేశ్‌లుగా యూపీని విభజించాలని ఆ తీర్మానంలో ప్రతిపాదించారు. రాష్ట్రం వైశాల్యంలోనూ, జనాభాలోనూ మరీ పెద్దదిగా ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో పరిపాలన కష్టమవుతోందని అప్పట్లో మాయావతి ప్రభుత్వం బలంగా వాదించింది. అయితే 2012లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ తీర్మానం అటకెక్కింది.

ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, పశ్చిమ్ ప్రదేశ్‌లో దాదాపు 28 జిల్లాలు ఉంటాయి. ఇందులో సహరాన్‌పూర్, మీరట్, ఆగ్రా, ఘజియాబాద్ లాంటి అత్యంత కీలక ప్రాంతాలు వస్తాయి. ఇక్కడి వ్యవసాయం, చెరుకు ఆధారిత ఆర్థిక వ్యవస్థ, మరియు దేశ రాజధాని దిల్లీకి దగ్గరగా ఉండటం వంటి బలమైన కారణాలతో పశ్చిమ యూపీని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఆర్ఎల్‌డి వ్యవస్థాపకుడు అజిత్ సింగ్ లాంటి దిగ్గజ నేతలు ఎప్పట్నుంచో కోరుతూ వచ్చారు.

ఇక అవధ్ ప్రదేశ్ విషయానికి వస్తే, ఇది ఉత్తరప్రదేశ్ మధ్య భాగంలో విస్తరించి ఉంటుంది. రాజధాని లక్నో సహా అయోధ్య, రాయ్ బరేలీ, అమేథీ వంటి 17 జిల్లాలు ఈ ప్రతిపాదిత అవధ్ ప్రదేశ్‌లో భాగమవుతాయి. మరోవైపు బుందేల్‌ఖండ్ ప్రాంతం యూపీతో పాటు పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా విస్తరించి ఉంది. యూపీలోని ఝాన్సీ, మహోబా, బాందా సహా ఏడు జిల్లాలు ఈ ప్రతిపాదిత బుందేల్‌ఖండ్ రాష్ట్రంలోకి వస్తాయి. అయితే మధ్యప్రదేశ్ సరిహద్దుల వివాదం కారణంగా ఈ రాష్ట్ర ఏర్పాటు కాస్త సంక్లిష్టంగా మారింది. అలాగే తూర్పు ఉత్తరప్రదేశ్‌ను కవర్ చేస్తూ పూర్వాంచల్ రాష్ట్ర ప్రతిపాదన ఉంది. అత్యధిక జనాభా, తీవ్రమైన ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం వలసల సమస్యల కారణంగా వారణాసి, ప్రయాగ్‌రాజ్ లాంటి జిల్లాలతో కూడిన పూర్వాంచల్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా బలంగా వినిపిస్తోంది.

పాలనా సౌలభ్యం, ప్రాంతీయ అభివృద్ధే   లక్ష్యంగా ఈ చిన్న రాష్ట్రాల డిమాండ్ తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఇది దేశంలోనే అత్యధికం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే తుది అధికారం  పార్లమెంటుకే ఉంటుంది. ఇలాంటి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి సిఫార్సు తప్పనిసరి. రాష్ట్రపతి ఈ ప్రతిపాదనను రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతారు, కానీ ఒకవేళ ఆ శాసనసభ ఆమోదం తెలపకపోయినా పార్లమెంట్ తన అధికారంతో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలదు. గతంలో 2000 సంవత్సరంలో కూడా ఉత్తరాఖండ్‌ను యూపీ నుంచే   విడదీశారు. ఇప్పుడు ఏకంగా యూపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీ నాయకుల నుంచే ఈ విభజన మాటలు వినిపిస్తుండటంతో కేంద్రంలోని అధికార పార్టీ కూడా భవిష్యత్తులో ఈ దిశగా అడుగులేస్తుందా అన్న చర్చ మొదలైంది.

[Uttar Pradesh Division, Up Four States, Purvanchal State, Bundelkhand, UP Politics, Telugu One]