చెప్పేటందుకే నీతులు.! అగ్రరాజ్యాధినేత ట్రంప్ తీరుపై విమర్శలు.!
Published on: Fri Sep 18, 2026 11:24AM

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తీరు వివాదాస్పదంగా ఉంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, దేశాలపై విధిస్తున్న ట్రాఫిక్ ల కొరడాలపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్న అమెరికా, తన అవసరాల విషయంలో మాత్రం రష్యానుంచి అవసరమైన దిగుమతులు చేసుకుంటున్నది.
రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకునే ఇతర దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న అగ్రరాజ్యం.. స్వయంగా తాము మాత్రం మాస్కో నుంచి యురేనియం దిగుమతులను కొనసాగిస్తుంన్నది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీగా 100 శాతం వరకు సుంకాలు విధించేలా అమెరికాలో ఒక కొత్త చట్టానికి మార్గం సుగమమైంది. లిండ్సే ఓ.గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే, రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే ఇండియా, చైనా వంటి దేశాలపై 100 శాతం వరకు భారీ టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు దఖలుపడుతుంది. అయితే ఈ టారిఫ్‌లు ఆటోమేటిక్‌గా అమలు అవ్వవు. కాబట్టి,అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఈ అధికారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
.webp)
మరోవైపు సరిగ్గా ఇదే సమయంలో రష్యా నుంచి వచ్చే అణు ఇంధనంపై మాత్రం అమెరికా పూర్తిస్థాయిలో నిషేధం విధించలేదు. ముఖ్యంగా రష్యా నుంచి లభిస్తున్న తక్కువ సాంద్రత యురేనియం విషయంలో అమెరికా కొన్ని పరిమిత స్థాయి మినహాయింపులను కొనసాగిస్తోంది. అమెరికా పౌర అణు విద్యుత్ రంగానికి రష్యా నుంచి అందుతున్న ఇంధన సరఫరాయేఅత్యంత కీలకం కావడం ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి 2024లోనే అమెరికా రష్యన్ యురేనియం దిగుమతులపై కొన్ని ఆంక్షలు ప్రకటించింది.
అయినప్పటికీ, దేశీయ అణు రియాక్టర్లకు తక్షణ ప్రత్యామ్నాయం దొరకని క్లిష్ట పరిస్థితుల్లో ఈ దిగుమతులకు మినహాయింపునిచ్చే వెసులుబాటును అమెరికా అలాగే ఉంచుకుంది. ఈ ప్రత్యేక మినహాయింపులు 2028 జనవరి 1వ తేదీ వరకు అమల్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అమెరికా అణు విద్యుత్ రంగానికి రష్యన్ యురేనియం ఏ స్థాయిలో అవసరమో తాజాగా వెలువడిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, 2025 సంవత్సరంలో అమెరికా పౌర అణు విద్యుత్ రియాక్టర్ల నిర్వాహకులు కొనుగోలు చేసిన ఎన్‌రిచ్‌మెంట్ సేవల్లో కేవలం రష్యా వాటా 26 శాతంగా ఉంది.
ఇదే సమయంలో అమెరికా స్వదేశీ వాటా 23 శాతం, ఫ్రాన్స్ 18 శాతం, బ్రిటన్ 14 శాతం, నెదర్లాండ్స్ 8 శాతం చొప్పున ఇంధన సేవలను అందించాయి. ఈ లెక్కలను బట్టి చూస్తే రష్యాతో అణు ఇంధన సంబంధాలను ఒక్కసారిగా తెంచుకోవడం అమెరికాకు ఎంతమాత్రం సులభమైన విషయం కాదు. ఒకవైపు రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఆంక్షల అస్త్రం సంధిస్తూనే, మరోవైపు తమ దేశీయ అణు విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి ఇంధన కొరత రాకుండా అగ్రరాజ్యం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. మరోపక్క భారత్ వంటి దేశాలపై మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి పట్ల అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. తన కొక నీతి, ఇతర దేశాలకు మరొకనీతా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
[USA sanctions, Russian Uranium, Russia Oil Trade, Lindsey O Graham act, US Energy Tariffs, Donald Trump]


