అమెరికా ఆర్థిక వ్యవస్థకు బాండ్ మార్కెట్ షాక్!
Published on: Tue Aug 25, 2026 5:07PM

అమెరికా ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్న ట్రెజరీ ఈల్డ్స్. పెరుగుతున్న బడ్జెట్ లోటు అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక పునాదులను కుదిపేసే దిశగా మార్కెట్ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా ప్రభుత్వానికి చెందిన 30 ఏళ్ల ట్రెజరీ బాండ్ ట్రెజరీ ఈల్డ్స్ ఇటీవల 5.3 శాతం మార్కును దాటి 5.31 శాతం వద్ద ముగియడం ప్రపంచ ఆర్థిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీర్ఘకాలిక వ్యవధి కలిగిన రుణాలపై పెట్టుబడిదారులు ఇప్పుడు అత్యంత అధిక ప్రతిఫలాన్ని ఆశిస్తున్నారని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
ఇది కేవలం స్టాక్ మార్కెట్లలో లేదా బాండ్ మార్కెట్లలో కనిపించే ఒక సాధారణ రోజువారీ వ్యత్యాసం మాత్రమే కాదు. అపరిమితంగా పెరుగుతున్న బడ్జెట్ లోటు, అదుపు తప్పిన రుణం, మునుపెన్నడూ లేని విధంగా పెరిగిపోతున్న వడ్డీ చెల్లింపుల భారం వంటి మూడు వభిన్న రకాల ఆర్థిక ఒత్తిళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉక్కిరి బిక్కిరి అవుతోందనడానికి ఈ పరిస్థితి తార్కాణంగా ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మార్కెట్ వర్గాల విశ్లేషణల ప్రకారం, 2007 జూన్ తర్వాత 30 ఏళ్ల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్5.3 శాతం దాటి నమోదు కావడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఫెడరల్ రిజర్వ్ బాండ్ ధరలు తగ్గినప్పుడు వాటి ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుతుంటాయి. బాండ్ల ధరలు పడిపోవడం అంటే అర్థం.. పాత లేదా తక్కువ వడ్డీ ధరల వద్ద అమెరికా ప్రభుత్వ రుణపత్రాలను కొనుగోలు చేయడానికి పెట్టుబడిదారులు సుముఖంగా లేరని. కొత్తగా ప్రభుత్వం జారీ చేసే ప్రతి బాండ్‌పై మరింత ఎక్కువ వడ్డీ ఇస్తే తప్ప కొనుగోలుదారులు ముందుకు రావడం లేదనే నిజాన్ని ఈ సంఖ్యలు ఎత్తి చూపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావించే అమెరికా ప్రభుత్వ రుణపత్రాలకు కూడా ఇప్పుడు రిస్క్ ప్రీమియం పెరిగిపోవడం ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
మరోవైపు అమెరికా మొత్తం ప్రభుత్వ రుణం ఇప్పటికే 40 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటి కొత్త రికార్డులను సృష్టించింది. నివేదికల ప్రకారం ఫెడరల్ రికార్డుల్లో పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ 40.047 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో సాధారణ ప్రజలు, ప్రైవేట్ పెట్టుబడిదారులు, విదేశీ ప్రభుత్వాల చేతిలో ఉన్న రుణం సుమారు 32.266 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, ప్రభుత్వ అంతర్గత ఖాతాలు, ఇతర నిధుల రూపంలో ఉన్న రుణం 7.782 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.
పొదుపు నిధులు లేదా అంతర్గత ఖాతాల రుణం పక్కన పెడితే.. మార్కెట్ నుంచి నేరుగా సమీకరించిన రుణమే ప్రభుత్వ ఆర్థిక స్థితిని నిర్ధారించే అసలు ప్రామాణికంగా మారుతోంది. కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం (సీబీఓ) విడుదల చేసిన గణాంకాలు రాబోయే కాలంలో ఈ పరిస్థితి మరింత దిగజారనుందని హెచ్చరిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రజల చేతిలో ఉన్న అమెరికా ఫెడరల్ రుణం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 101 శాతానికి చేరుతుంది. అలాగే 2036 నాటికి అది 120 శాతానికి పెరిగే అవకాశం ఉందని సీబీఓ అంచనా వేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తదనంతర కాలంలో నమోదైన 106 శాతమనే చారిత్రక రికార్డును కూడా ఈ అప్పుల భారం త్వరలోనే తుడిచిపెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాత తక్కువ వడ్డీ రుణాల గడువు తీరిపోతున్న కొద్దీ, వాటి స్థానంలో అధిక వడ్డీతో కొత్త రుణాలు తీసుకోవాల్సి రావడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. బాండ్ ఈల్డ్స్ ఈ స్థాయిలో పెరగడానికి కేవలం ద్రవ్యోల్బణ అంచనాలు మాత్రమే కారణం కాదు. భవిష్యత్తులో ఫెడరల్ రిజర్వ్ తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయాలు, సుదీర్ఘ కాలం పాటు బాండ్లను తమ వద్ద ఉంచుకోవడానికి పెట్టుబడిదారులు కోరే టర్మ్ ప్రీమియంతో పాటు విపరీతంగా పెరిగిపోయిన బాండ్ల సరఫరా కూడా కారణమవుతోంది. ప్రభుత్వం తన సంపాదన కంటే ఎక్కువ ఖర్చు చేస్తూ, ప్రతి సంవత్సరం భారీగా కొత్త బాండ్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. సరఫరా విపరీతంగా పెరిగినప్పుడు కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ధర తగ్గడం, తద్వారా ఈల్డ్స్ పెరగడం సహజ ఆర్థిక సూత్రం. బడ్జెట్ లోటు అనేది కేవలం అంచనాలకే పరిమితం కాకుండా వేగంగా పెరుగుతున్న చేదు వాస్తవంగా మారింది.
2026 నాటికి బడ్జెట్ లోటు 1.9 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని ఊహించినప్పటికీ, ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లోనే అది 1.799 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. జూలై నెలలో సుమారు 33.38 బిలియన్ డాలర్ల టారిఫ్ రీఫండ్లు చెల్లించాల్సి రావడంతో కస్టమ్స్ రాబడులు ప్రతికూలంగా మారాయి. నిలకడ లేని పన్నులు, తాత్కాలిక టారిఫ్ రాబడులపై ఆధారపడి ప్రభుత్వం శాశ్వత సంక్షేమ పథకాలను లేదా ఖర్చులను నిర్వహించడం ఎంత ప్రమాదకరమో ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. వడ్డీ వ్యయం పెరగడం వల్ల నేరుగా అమెరికా పన్ను చెల్లింపుదారులపై భారం పడుతోంది. 2026 నాటికి అమెరికా ప్రభుత్వం కేవలం అప్పులపై వడ్డీ చెల్లించడానికే ట్రిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని సీబీఐ గతంలోనే అంచనా వేసింది. 2036 నాటికి ఈ వడ్డీ వ్యయం జీడీపీలో 4.6 శాతానికి చేరి, మొత్తం ఫెడరల్ బడ్జెట్‌లో ఐదవ వంతును మింగేసే ప్రమాదం ఉంది. దీనివలన మౌలిక వసతులు, విద్య, రక్షణ, ఆరోగ్య రంగానికి కేటాయించాల్సిన ప్రజాధనం పూర్తిగా పాత అప్పుల వడ్డీలకే సరిపోతుంది. ఇది ఒక విధంగా వడ్డీ కోసం అప్పు, ఆ అప్పు కోసం మళ్లీ అప్పు అనే ఆర్థిక సుడిగుండంగా మారుతోంది.
గతంలో 2007లో బాండ్ ఈల్డ్స్ ఈ స్థాయికి చేరినప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ కూలిపోయే స్థితికి వచ్చింది. తదనంతరం 2008 సంక్షోభం, కరోనా మహమ్మారి కాలంలో చేపట్టిన భారీ ఉద్దీపన చర్యలు అమెరికా రుణాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లాయి. 1930ల నాటి మహా మాంద్యం తర్వాత ఇంత సుదీర్ఘ కాలం పాటు బడ్జెట్ లోటు జీడీపీలో 5.6 శాతానికి పైగా కొనసాగడం ఇదే తొలిసారి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం ఏదో ఒక పార్టీ లేదా ప్రభుత్వ వైఫల్యం కాదు.. దశాబ్దాలుగా రెండు ప్రధాన పార్టీలు తెచ్చిన పన్ను తగ్గింపులు, సంక్షేమ హామీల ఫలితంగా ఏర్పడిన నిర్మాణపరమైన సమస్య. రాజకీయంగా కాంగ్రెస్ విధించే రుణ పరిమితి చట్టాలు నాటకీయ పోరాటాలకు వేదికవుతున్నప్పటికీ, ఖర్చులపై స్పష్టమైన నియంత్రణ పాటించకపోవడం అసలు కారణం.
ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు, అధిక టారిఫ్‌ల చెల్లుబాటుపై వచ్చిన చట్టపరమైన సవాళ్లు ప్రభుత్వ రాబడులపై అనిశ్చితిని మరింత పెంచాయి. ప్రస్తుత పాలకులు ఈ పరిస్థితిని అదుపు చేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. బాండ్ ఈల్డ్స్ పెరగడం అనేది కేవలం బ్యాంకింగ్ రంగానికో లేదా వాల్ స్ట్రీట్‌కో పరిమితమైన అంశం కాదు. ట్రెజరీ ఈల్డ్స్ ఆధారంగానే గృహ రుణాలు, వ్యాపార, వాహన రుణాలు, క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు నిర్ణయించబడతాయి. బాండ్ ఈల్డ్ పెరిగితే సామాన్య పౌరుడికి నెలవారీ ఈఎంఐ పెరుగుతుంది, చిన్న వ్యాపారులకు పెట్టుబడి ఖరీదవుతుంది. ప్రభుత్వం ఉత్పాదక రంగాల్లో కాకుండా కేవలం పాత వడ్డీలు కట్టడానికే అప్పులు చేస్తే దేశ ఆర్థిక వృద్ధి కుంటుపడుతుంది. 5.3 శాతం బాండ్ ఈల్డ్ అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనానికి సంకేతం కాకపోవచ్చు, కానీ బాధ్యతారాహిత్యంగా చేసే ప్రతి ఖర్చుకూ భారీ ధర చెల్లించాల్సి ఉంటుందని బాండ్ మార్కెట్ ఇస్తున్న స్పష్టమైన హెచ్చరిక.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
US Treasury Yield, US National Debt 40 Trillion, US Federal Budget Deficit, America Economy, Financial Crisis, CBO Budget Projections


