రష్యా చమురు కోనుగోళ్లపై ట్రంప్ కొరడా.. ఇండియాకు చిక్కులు తప్పవా?
Published on: Thu Sep 17, 2026 9:47AM

ఇరాన్ దేశాలపై కఠిన ఆంక్షలు విధించే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభ ఒక కీలకమైన బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదిత చట్టం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం తరువాయిగా మిగిలింది. ఈ పరిణామం రష్యా నుంచి భారీ ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న ఇండియాకు కొత్త సవాళ్లను సృష్టిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో ఈ తాజా పరిణామం హాట్ టాపిక్ గా మారింది.
(సెప్టెంబర్ 16) జరిగిన ఓటింగ్ ప్రక్రియలో లిండ్సే ఓ.గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 బిల్లుకు హౌస్ ఆమోద ముద్ర వేసింది. అంతకుముందే గత నెలలో అమెరికా సెనేట్ కూడా ఈ బిల్లును ఆమోదించింది. ఈ కొత్త చట్టం ప్రకారం, రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువును అధిక పరిమాణంలో కొనుగోలు చేస్తున్న ఐదు దేశాలపై వంద శాతం వరకు భారీ టారిఫ్‌లు విధించే విసృతమైన అధికారాలను అమెరికా అధ్యక్షుడికి దఖలు పడతాయి. ఈ జాబితాలో రష్యా నుంచి చమురు దిగుమతులు జరుపుతున్న భారత్, చైనాలు ముందువరుసలో ఉన్నాయి. వీటితో పాటు హంగేరీ, స్లోవేకియా, అజర్‌బైజాన్ దేశాలపై కూడా ఈ చట్టం ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, రష్యా ఇంధన వనరులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్న కొన్ని యూరోపియన్ మిత్రదేశాలకు మాత్రం ఈ నిబంధనల నుంచి ప్రత్యేక మినహాయింపులు కల్పించారు.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి, అంటే 2022 నుంచి భారత్ రాయితీ ధరలకే రష్యా నుంచి పెద్ద ఎత్తున ముడి చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికీ ఈ చమురు దిగుమతులు భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా మారాయి. అయితే, అమెరికా తాజా చట్టం అమలులోకి వస్తే, భారత దిగుమతిదారులు, ఎగుమతిదారులలో తీవ్ర ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. రష్యన్ చమురు దిగుమతులపై వంద శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం రావడంతో వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే.. ఈ కఠినమైన టారిఫ్‌ల విధింపు ప్రక్రియ వెంటనే అమలవుతుందా లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ చట్టం కింద టారిఫ్‌లు విధించాలా వద్దా అనే దానిపై తుది నిర్ణయం పూర్తిగా అమెరికా అధ్యక్షుడి విచక్షణకే వదిలివేయడం గమనార్హం. అంతే కాకుండా, అమెరికా జాతీయ ప్రయోజనాలు, దౌత్యపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్దిష్ట దేశాలకు టారిఫ్‌ల నుంచి మినహాయింపునిచ్చే వెసులుబాటు కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. దీనివల్ల పరిస్థితులను బట్టి దౌత్య చర్చలకు ఇంకా అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడా 2025 ఆగస్టు నెలలో ట్రంప్ పాలకవర్గం రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నారనే కారణంతో భారత దిగుమతులపై పాతిక శాతం అదనపు టారిఫ్‌లను విధించింది. అయితే ఆ తర్వాత ద్వైపాక్షిక చర్చల అనంతరం 2026 ఫిబ్రవరిలో ఆ అదనపు టారిఫ్‌లను ఎత్తివేశారు. ఇప్పుడు తాజాగా ప్రతిపాదించిన ఈ కొత్త బిల్లు ద్వారా అమెరికా అధ్యక్షుడి చేతికి మరింత శక్తివంతమైన అధికారాలు రానున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన ఈ చట్టంపై అధికారికంగా సంతకం చేసిన తర్వాతే భారత్‌పై టారిఫ్‌ల విధింపు విషయంలో వాస్తవ పరిస్థితి ఏమిటనేది స్పష్టమౌతుంది.
ఇండియా దేశీయ ఇంధన భద్రతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. ముడి చమురు సరఫరా విషయంలో దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు విభిన్న మార్గాలను అన్వేషిస్తోంది. రష్యాతో దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాలు, అలాగే అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమతుల్యం చేసుకోవడం భారత విదేశాంగ విధానానికి ప్రస్తుతం ఒక పెద్ద పరీక్షగా మారింది. అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతున్నప్పటికీ, దేశ ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ప్రభుత్వం ఎలాంటి దౌత్యపరమైన చర్యలు తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది.
రాబోయే రోజుల్లో ట్రంప్ నిర్ణయాలు, విధివిధానాలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ ఇంధన అవసరాల కోసం ఏకపక్ష ఆంక్షలకు తలవంచకుండా ప్రత్యామ్నాయ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య సమీకరణాలను మార్చేయగలవు కాబట్టి, రానున్న కాలంలో భారత్-అమెరికా-రష్యా సంబంధాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయనే అంశంపై ప్రపంచ దేశాలు కూడా నిశితంగా దృష్టి సారిస్తున్నాయి.
[US sanctions on Russia, India Russia oil trade, US tariffs on India, Donald Trump Russian oil, Russian oil sanctions 2026, Telugu One]


