ఇండియాపై అమెరికా టాక్స్ వార్?
Published on: Wed Sep 16, 2026 1:27PM

రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు కొనసాగిస్తున్న దేశాలపై ఉక్కుపాదం మోపే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేగంగా అడుగులు వేస్తున్నారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు నెరుపుతూ, భారీగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న భారత్ వంటి అగ్రగామి దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించడానికి వీలు కల్పించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ముందడుగు పడింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న సంఘర్షణ నేపథ్యంలో రష్యా ఆర్ధిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు.
లిండ్సే గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026' పేరుతో రూపొందించిన ఈ బిల్లుకు సంబంధించి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఒక తీర్మానం ఆమోదం పొందింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 214 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ ప్రక్రియలో కొందరు డెమొక్రాట్ తమ పార్టీ నిర్ణయానికి భిన్నంగా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడం గమనార్హం. దీనితో అక్కడ ఊహించని పరిణామాలు చోటుచేసుకుని, ఈ బిల్లు తుది ఓటింగ్‌కు వెళ్లే మార్గం సుగమమైంది.

ఇప్పటికే ఈ బిల్లును అమెరికా సెనేట్ గతంలోనే 86-11 భారీ మెజారిటీతో ఆమోదించింది. ఇప్పుడు ప్రతినిధుల సభలో కూడా దీనిపై తుది ఓటింగ్ నిర్వహించనున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా ఈ బిల్లుకు ఆమోదముద్ర పడితే, ఇది అమెరికా అధ్యక్షుడి సంతకంతో చట్ట రూపం దాలుస్తుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే, రష్యా నుంచి అత్యధిక పరిమాణంలో చమురు, సహజవాయువును దిగుమతి చేసుకుంటున్న దేశాల దిగుమతులపై 100 శాతం వరకు భారీ టారిఫ్‌లు విధించే విశేషాధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది.
ఈ బిల్లు ప్రధానంగా రష్యా నాయకత్వాన్ని, ఆ దేశ ఇంధన రంగాన్ని, రక్షణ శాఖను అలాగే పశ్చిమ దేశాల ఆంక్షలను తప్పించుకోవడానికి మాస్కో ఉపయోగిస్తున్న షాడో ఫ్లీట్ నౌకల వలయాన్ని టార్గెట్ చేస్తోంది. అంతేకాకుండా, ఇరాన్‌పై ఇప్పటివరకు అమలులో ఉన్న ఆంక్షలను కూడా ఈ చట్టం మరింత పొడిగించనుంది. రష్యా ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తోందని, అందువల్ల ఆ దేశ ఇంధన వాణిజ్య భాగస్వాములైన భారత్, చైనా వంటి దేశాలపై ఆర్థిక ఒత్తిడి తేవడం ద్వారా యుద్ధాన్ని నిలువరించవచ్చని బిల్లును సమర్ధిస్తున్నవారు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
అయితే.. ఈ బిల్లుపై అమెరికా రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి కఠిన నిబంధనలు, అడ్డుకట్టలు లేకుండా ఇంత భారీ స్థాయిలో టారిఫ్‌లు విధించే అపరిమిత అధికారాలను కట్టబెట్టడం సరికాదని కొందరు డెమొక్రాట్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధమైన ఆర్థిక ఆంక్షలు భవిష్యత్తులో దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా.. అమెరికా వినియోగదారులపై కూడా ధరల భారాన్ని మోపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఉక్రెయిన్‌కు అమెరికా ఇస్తున్న నిరంతర మద్దతును కొనసాగించాలని కోరుతూ దేశంలోని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు కూడా ప్రస్తుతం వాషింగ్టన్‌లో ముమ్మర లాబీయింగ్ నిర్వహిస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఈ రష్యా వ్యతిరేక ఆంక్షల బిల్లుకు ఊతం లభిస్తోంది. అయితే.. రిపబ్లికన్ పార్టీలో కూడా ఉక్రెయిన్ వివాదంలో అమెరికా అనవసర జోక్యాన్ని వ్యతిరేకించే వర్గాలు ఉండటంతో, ఈ బిల్లుపై రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
వచ్చే కొద్ది రోజుల్లో ప్రతినిధుల సభ సమావేశాలు విరామంలోకి వెళ్లనున్న నేపథ్యంలో.. ఈ బిల్లుకు సంబంధించి జరగబోయే తుది ఓటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే.. అది అంతర్జాతీయ వాణిజ్య రంగంలో, ముఖ్యంగా అమెరికా, భారత్ సహా ఇతర దేశాల మధ్య ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా ఇంధన దిగుమతులపై అమెరికా తీసుకోబోయే ఈ నిర్ణయం ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఎలాంటి మలుపులకు దారితీస్తుందనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
[US sanctions bill, Russian oil imports, 100 percent tariffs on India, US House of Representatives, Donald Trump tariffs, Telugu One]


