వేధింపులు, వెట్టి చాకిరీ కేసులో: వైసీపీ నేత వెంకటేశ్ రెడ్డికి అమెరికాలో 50 నెలల జైలు.!
Published on: Sun Oct 11, 2026 9:22AM

వైసీపీయుల ఆగడాలు, అరాచకాలు, దారుణాలకు ఆంధ్రప్రదేశ్, అమెరికా అనే తేడాలు లేవు.. దేశ సరిహద్దులు దాటినా వారి నైజం అదేనని తెలియజేసే ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉదంతంలో అక్కడి ఫెడరల్ కోర్టు వైసీపీ నాయకుడు సత్తారు వెంకటేష్ రెడ్డికి 50 నెలల కారాగార శిక్ష విధిసతూ తీర్పు వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతగా చెలామణి అవుతూ, ఆ పార్టీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కలిగిన సత్తారు వెంకటేష్ రెడ్డికి అమెరికాలోని మిస్సోరి ఫెడరల్ కోర్టు 50 నెలల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. భారీ జరిమానా కూడా విధించింది.
మెరుగైన ఉపాధి కల్పిస్తామంటూ ప్రలోభ పెట్టి తన స్వగ్రామానికి చెందిన ఒక క యువకుడిని వెంకటేష్ రెడ్డి అమెరికాకు రప్పించాడు. మిస్సోరిలోని సెయింట్ చార్లెస్ కౌంటీ, డిఫైయెన్స్ ప్రాంతంలోని తన నివాసంలో ఆ 20 ఏళ్ల యువకుడిని బంధించి నరకం చూపించాడు. సరిగ్గా పని చేయలేదనే నెపంతో విచక్షణారహితంగా కొడుతూ క్రూర హింసలకు పాల్పడ్డాడు. ప్రధాన సూత్రధారి అయిన వెంకటేష్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి మరీ ఆ యువకుడిని మరింత తీవ్రంగా కొట్టాలని ఆదేశించేవాడు.
నెలల తరబడి సాగిన ఈ అమానుష వేధింపుల కారణంగా ఆ యువకుడు కనీసం తిండి, నిద్ర లేకుండా తీవ్రంగా క్షీణించిపోయాడు. నడవలేని స్థితికి చేరుకున్నాడు. చివరకు ఆ ఇంటి చుట్టుపక్కల ఉండే ఒక వ్యక్తి అందించిన సమాచారం మేరకు అమెరికన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆ ఇంటిపై మెరుపు దాడి చేసి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా వెంకటేష్ రెడ్డితో పాటు అతనికి సహకరించిన శ్రావణ్ వర్మ పెనుమత్స, నిఖిల్ వర్మ పెన్మెత్స అనే మరో ఇద్దరు తెలుగు యువకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడితో వెట్టి చాకిరీ చేయించడం, కార్మికుల చట్టాల ఉల్లంఘన, మానవ అక్రమ రవాణా, అస్సాల్ట్ అభియోగాలతో పాటు ఫెడరల్ ప్రభుత్వ నిధులను అక్రమంగా కాజేసిన ఆరోపణలపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. సమగ్ర విచారణ అనంతరం న్యాయస్థానం ఈ దారుణానికి పాల్పడిన వెంకటేష్ రెడ్డికి 50 నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.
[US Prison Sentence YCP Leader Venkatesh Reddy, Missouri Federal Court, Human trafficking, Forced Labor Telugu One]


