లక్ష బాడీ బ్యాగ్స్ సిద్ధం చేయమని అమెరికా ఫెమాను ఆదేశించిందా?

ఇటలీలో కంటే అమెరికాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచంలో ఇంకే దేశంలో లేనంతగా పెరిగిపోయాయి. అమెరికాలో మృతుల సంఖ్య 8444గా నమోదైంది. అమెరికా ప్రభుత్వం లక్ష బాడీ బ్యాగ్స్ సిద్ధం చేసుకుంటోంది. రోజురోజుకూ కొత్తగా కొన్ని వేల‌ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. ఈ పరిస్థితుల్లో వైట్ హౌస్ వర్గాలు కనీసం లక్ష మంది చనిపోతారని అంచనా వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా తన దేశ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఫెమా)ను లక్ష బాడీ బ్యాగ్స్ సిద్ధం చేయమని ఆదేశించింది. పెంటగాన్ కూడా ఈ విషయం నిజమేనని ప్రకటించింది.

న్యూయార్క్ నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్క‌డి ఆసుపత్రులలో వెంటిలేటర్లు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. న్యూయార్క్ తర్వాత న్యూజెర్సీ - కాలిఫోర్నియా - ఫ్లోరిడా - వాషింగ్టన్ - లూసియానా - పెన్సీల్వేనియా - జార్జీయా - టెక్సాస్ తదితర రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది.

రానున్నది గడ్డు కాలం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అనేక మరణాలను చూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.

జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చైనాలో తలెత్తిన పరిస్థితి, ఆపై ఇటలీలో కరోనా సృష్టించిన కల్లోలాన్ని చూస్తూ కూడా అమెరికా అధ్యక్షుడు మాత్రం తమ దేశానికి ఎదురుకాబోయే ముప్పు తీవ్రతను ఎప్పటికప్పుడు తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు.

మొదట్లో కొద్ది సంఖ్యలో కేసులు నమోదైనప్పుడు పరిస్థితి అంతా అదుపులోనే ఉందని వేసవి నాటికి అంతా కుదుట పడుతుందని మసి పూసి మారేడుకాయ చేసేందుకు ట్రంప్ ప్రయత్నించి ఇప్పుడు ఈ దారుణ‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు.