రష్యా విమానాశ్రయంలో అమెరికా యుద్ధ విమానం.. ఏం జరుగుతోంది?
Published on: Tue Aug 25, 2026 6:07PM

ప్రపంచ దేశాల ఉద్రిక్తతలు పీక్స్ కు చేరిన ఈ తరుణంలో అమెరికా యుద్ధ విమానం రష్యా రాజధాని మాస్కోలోని నుకోవో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వడం కలకలం రేపింది. ఉక్రెయిన్ మరియు రష్యాల నాలుగేళ్లుగా అత్యంత భీకరమైన సాయుధ పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో, ఉక్రెయిన్‌కు నేరుగా సైనిక మద్దతు అందిస్తున్న అమెరికాకు చెందిన యుద్ధ విమానం రష్యన్ భూభాగంలో ల్యాండ్ కావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫ్లైట్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అందించిన వివరాల ప్రకారం, ఆర్సీహెచ్ 4555 అనే నంబరు కలిగిన అమెరికా మిలిటరీ ఫ్లైట్ అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతం నుండి బయలుదేరి రిగా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.ఆ తర్వాత రిగా విమానాశ్రయం నుంచి మాస్కోలోని నుకోవో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది. అమెరికా సైనిక రవాణా విభాగంలో సీ-17 గ్లోబ్‌మాస్టర్ III విమానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భారీ ఎత్తున సైనిక సిబ్బందిని, యుద్ధ సామాగ్రిని త్వరితగతిన రవాణా చేయడంతో పాటు, అత్యున్నత స్థాయి దౌత్యవేత్తలు, ప్రెసిడెన్షియల్ కార్యాలయ అధికారుల ప్రయాణాలకు ఈ విమానాలను వినియోగిస్తుంటారు.అటువంటి విమానం రష్యాలో అకస్మాత్తుగా ల్యాండ్ అవ్వడం వెనుక ఉన్న కారణాలు, వ్యూహాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా, రష్యాల మద్య బ్యాక్ డోర్ దౌత్య చర్చలు జరుగుతున్నాయా? అన్న వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి.
రష్యాపై అమెరికా ఆర్థిక, దౌత్య ఆంక్షలు విధించిన క్రమంలో అమెరికా మిలిటరీ రవాణా విమానం మాస్కో రావడంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. అయితే అమెరికా యుద్ధ విమానం రష్యాలో ల్యాండ్ అయిన విషయంపై తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు.
రెండు దేశాల మధ్య తక్షణమే ఎలాంటి అధికారిక దౌత్య సమావేశాలు జరగడం లేదని రష్యా ప్రభుత్వ మీడియా స్పష్టం చేసింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, హార్మూజ్ జలసంధి లో నౌకల రాకపోకల స్తంభన నేపథ్యంలో ఈ మిలిటరీ విమానం ల్యాండింగ్ ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉక్రెయిన్ సంక్షోభం ముదిరిన తర్వాత అమెరికా, రష్యాల మధ్య కమ్యూనికేషన్ దాదాపుగా మూసుకుపోయింది.ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధ విమానం రష్యా రాజధాని మాస్కో లో ల్యాండ్ కావడం... అత్యవసర సంప్రదింపుల కోసమా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
US Military Plane lands inMoscow, C-17 Globemaster III Russia, Russia US Relations News, Moscow Vnukovo Airport US Aircraft, US Air Force Moscow Landing Telugu News


