అమెరికా మధ్యంతర ఎన్నికలు: డెమొక్రట్ల ఆధిక్యత: ట్రంప్ శిబిరంలో ఆందోళన.!
Published on: Wed Nov 4, 2026 7:58AM

అమెరికా రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్న మధ్యంతర ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అనూహ్యంగా డెమొక్రట్లు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. తొలి దశ ఫలితాలు, ట్రెండ్స్ ను బట్టి అధికార రిపబ్లికన్ పార్టీపై డెమొక్రాట్ లు స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ కు నిస్సందేహంగా షాక్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్), సెనేట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు రెండు ప్రధాన రాజకీయ పార్టీల జరిగిన హోరాహోరీ పోరులో లెక్కింపు సరళిని బట్టి చూస్తే, పలు కీలక నియోజకవర్గాల్లో డెమోక్రాట్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా జార్జియా వంటి కీలక రాష్ట్రాల్లో డెమోక్రాట్ అభ్యర్థులు విజయం సాధించడం ఆ పార్టీ శిబిరంలో నూతనోత్సాహాన్ని నింపింది.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై అమెరికా ఓటర్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితులు ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ అనుసరించిన విధానాలపై అసంతప్తి కూడా ఉందని ఈ ఫలితాల సరళి తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డెమోక్రాట్లు తమకు అనుకూలంగా మలచుకోవడంలో సఫలమయ్యారని పరిశీలకులు అంటున్నారు. అమెరికా కాంగ్రెస్‌పై పూర్తి పట్టు సాధించడమే లక్ష్యంగా ఇరు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ప్రచార పర్వం నుంచి పోలింగ్ వరకు నాయకులు హోరాహోరీగా తలపడ్డారు. అయితే, తొలి సరళిలో డెమోక్రాట్లు ఊహించిన దానికంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండటంతో రిపబ్లికన్ పార్టీ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే విజేతలు ఎవరనేది తేలడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా పశ్చిమ రాష్ట్రాల నుంచి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడిన తర్వాతే కాంగ్రెస్‌పై ఏ పార్టీ పూర్తి ఆధిపత్యం సాధిస్తుందనే స్పష్టత రానుంది. ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చట్టసభల్లో మెజారిటీ కోల్పోతే ట్రంప్ వర్గం భవిష్యత్తులో కీలక బిల్లుల ఆమోదం విషయంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డెమోక్రాట్లు కనుక సభలపై పట్టు సాధిస్తే, వారు ప్రభుత్వ విధానాలను మరింత గట్టిగా వ్యతిరేకించే అవకాశం ఉంటుందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
[US Midterm Elections, Donald Trump, Republic Party, Democratic Party, US Congress, Georgia Senate Election, Telugu One]


