ట్రంప్ కు కర్రు కాల్చి వాత పెట్టనున్న అమెరికన్లు.!
Published on: Thu Sep 17, 2026 11:33AM

అమెరికా రాజకీయాల్లో మధ్యంతర ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో, దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ అనూహ్యంగా క్షీణించింది. మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభపై పట్టు నిలుపుకోవాలని వ్యూహాలు రచిస్తున్న రిపబ్లికన్ పార్టీకి ఈ పరిణామం షాక్ గా పరిణమించింది. ప్రజా మద్దతు వేగంగా క్షీణిస్తుండటం పట్ల అధికార రిపబ్లికన్ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తున్నది.
దేశవ్యాప్తంగా తాజాగా నిర్వహించిన పలు సర్వేల్లో ట్రంప్ పనితీరుపై ప్రజా వ్యతిరేకత పతాక స్థాయికి పెరిగినట్లు వెల్లడైంది. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ, ఆయన రేటింగ్ భారీగా పడిపోవడం రిపబ్లికన్లను కలవరపెడుతోంది.ఈ ప్రతికూలత రాబోయే ఎన్నికల ఫలితాలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న భయం వారిలో వ్యక్తం అవుతున్నది.
సర్వేల ప్రకారం ట్రంప్ పై వ్యతిరేకతకు దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రజలలో ఏర్పడిన అసంతృప్తి, నిరాశా నిస్ఫృహలే కారణమని తేలింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఉద్యోగ అవకాశాల కొరత వంటి అంశాలు సామాన్య ప్రజలలో అసంతృప్తికి కారణమని సర్వేలు తేల్చాయి. ఆర్థిక నిర్వహణ విషయంలో ట్రంప్ నిర్ణయాలపై మెజారిటీ ఓటర్లు ట్రంప్ పట్ల అసంతృప్తి, అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు సర్వేలు పేర్కొన్నాయి.
మరోవైపు, వైట్ హౌస్ వర్గాలు మాత్రం ఈ సర్వే ఫలితాలను తోసిపుచ్చుతున్నాయి. ప్రజా మద్దతు పడిపోతుందన్న వాదనలను తిరస్కరిస్తూ, ప్రజల నాడిని ఈ సర్వేలు సరిగ్గా ప్రతిబింబించడం లేదంటున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందని, ప్రజల్లో ట్రంప్ కు ఆదరణ ఇసుమంతైనా తగ్గలేదనీ సమర్థించుకుంటున్నాయి. అదే సమయంలో స్వతంత్ర విశ్లేషణలు, రాజకీయ వర్గాలు మాత్రం సర్వేల ఫలితాలను కొట్టిపారేయడానికి లేదని, అవి ప్రజాభిప్రాయాన్ని సరిగ్గానే ప్రతిబింబిస్తున్నాయని అంటున్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకత రిపబ్లికన్ పార్టీకి పెద్ద సవాలుగా పరిణమించిందనడంలో సందేహం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, ఆర్థిక భద్రత వంటి అంశాలపై ఓటర్లలో అసంతృప్తి గూడుకట్టుకుందంటున్నాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక భద్రత అంశాలే మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ పరిస్థితిని ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ అనుకూలంగా మలచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సామాన్యులను వేధిస్తున్న ఆర్థిక సమస్యలనే ప్రధాన అజెండాగా చేసుకుని ప్రచారాన్ని హోరెత్తించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో అమెరికా రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం అనుసరించే విధానాలు, ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకునే చర్యలే మధ్యంతర ఎన్నికల ఫలితాలను నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అమెరికన్ ఓటర్లు ట్రంప్ కు కిర్రు కాల్చి వాతపెట్టడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
[US Midterm Elections 2026, Donald Trump Approval Rating, America News, Survet Results, Trump Policy Pressure, US Politics 2026, Telugu One]


