ఇరాన్ తో యుద్ధం.. ఆర్థికంగా అమెరికా కుదేలు.!
Published on: Wed Sep 16, 2026 10:28AM
.webp)
ఇరాన్‌తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ కారణంగా అమెరికాపై మోయలేని ఆర్థిక భారం పడుతోంది. ఈ ఏడాది జులై వరకు పెంటగాన్ కేవలం ఇరాన్ తో యుద్ధం కోసమే 38 బిలియన్ డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 3.65 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీఓ) తాజా నివేదిక వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ అమెరికన్ రక్షణ శాఖ బడ్జెట్‌పై ఈ యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపుతోందనడానికి ఈ నివేదికే నిలువెత్తు సాక్ష్యం. ఇరాన్ తో యుద్ధంకు సంబంధించిన సైనిక కార్యకలాపాల వ్యయ వివరాలను పరిశీలిస్తే.. ధ్వంసమైన లేదా వినియోగించిన క్షిపణులు, ఇతర మందుగుండు సామగ్రిని తిరిగి భర్తీ చేసేందుకే అత్యధికంగా నిధులు ఖర్చయ్యాయి.
ఈ ఒక్క విభాగం కింద సుమారు 21.7 బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు అంచనా. ఇందులో ప్రధానంగా క్షిపణి రక్షణ ఇంటర్‌సెప్టర్ల కోసం 13.1 బిలియన్ డాలర్లు, ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణుల కోసం 7.3 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఇవి కాకుండా అదనపు విమానాల నిర్వహణ గంటల కోసం 10.4 బిలియన్ డాలర్లు, రక్షణ రంగ ఇంధన ఖర్చుల నిమిత్తం 2.7 బిలియన్ డాలర్లు, యుద్ధంలో కోల్పోయిన పరికరాల కోసం 1.9 బిలియన్ డాలర్లు, ఇతర కార్యాచరణ ఖర్చుల కింద 1.5 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయని నివేదిక వెల్లడించింది.

ఇరాన్ దాడుల కారణంగా ధ్వంసమైన అమెరికన్ సైనిక సదుపాయాల మరమ్మతులు, పునర్నిర్మాణానికి సంబంధించిన వ్యయం ఈ అంచనాలలో చేర్చలేదు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ మొత్తం మరింత పెరిగుతుంది. మరోవైపు, ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధ తీవ్రతను బట్టి ముందు ముందు నెలనెలా మరో 2నుంచి 3 బిలియన్ డాలర్ల వరకు అదనంగా ఖర్చయ్యేలా ఉందన్నది సీబీఓ అంచనా.
ఈ ఘర్షణల కారణంగా లో అమెరికా రక్షణ రంగ మందుగుండు నిల్వలు కూడా వేగంగా తరిగిపోతున్నాయి. క్షిపణి రక్షణ ఇంటర్‌సెప్టర్ల వినియోగాన్ని పరిశీలిస్తే.. అమెరికా తన వద్ద ఉన్న మొత్తం నిల్వలలో దాదాపు మూడింట రెండు వంతుల భాగాన్ని ఇప్పటికే వాడేసినట్లు సమాచారం. ఇది భవిష్యత్తులో దేశ రక్షణ సన్నద్ధతపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాల నడుమ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అదనపు నిధుల కోసం కాంగ్రెస్‌ను ఆశ్రయించింది. అమెరికా రక్షణ శాఖ కార్యకలాపాలు, ఇతర అత్యవసర అవసరాల నిమిత్తం 87.6 బిలియన్ డాలర్ల అదనపు నిధులను సమకూర్చాల్సిందిగా శ్వేతసౌధం ప్రతిపాదనలు పంపింది. ఇందులో సుమారు 67.1 బిలియన్ డాలర్లు నేరుగా పెంటగాన్‌కే చెందుతాయని, సుమారు 42.3 బిలియన్ డాలర్లు ప్రత్యక్షంగా ఇరాన్ యుద్ధానికే ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు.
అయితే, ఈ భారీ యుద్ధ ఖర్చులపై అమెరికా రాజకీయ వర్గాలలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశీయంగా నిత్యావసరాలు, ద్రవ్యోల్బణం, ఇంధన ధరల భారం పెరుగుతున్న తరుణంలో, ఈ స్థాయిలో నిధులు వెచ్చించడం పట్ల పలువురు చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
[US Iran War, Pentagon Expenses, Congressional Budget Office, US Military Budget, Donald Trump Iran Policy]


